
- మళ్లీ ఏక నాయకత్వంలోకి వెళ్లనున్న టీమిండియా
- ఆ దిశగా సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ అడుగులు
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్)
ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. టీమిండియా లెజెండరీ ప్లేయర్లు. ఆటగాళ్లుగా, కెప్టెన్లుగా ఇండియన్ క్రికెట్‌పై తమదైన ముద్ర వేసిన వాళ్లు. ఈ ముగ్గురిలో మరో కామన్ పాయింట్ ఉంది. ఇండియా టీమ్‌కు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించడం. తదుపరి ఈ జాబితాలో శుభ్‌మన్ గిల్ చేరబోతున్నాడా? సమీప భవిష్యత్తులోనే అన్ని ఫార్మాట్ల సారథ్యం అందుకొని టీమిండియాలో గిల్ నయా సూపర్ స్టార్‌గా మారబోతున్నాడా? ఆసియా కప్ టీమ్ సెలెక్షన్‌ను చూస్తుంటే దానికి ఔననే సమాధానం వస్తోంది. వచ్చే నెలలో జరిగే ఈ మెగా టోర్నీ కోసం ఇండియా జట్టును ప్రకటించిన తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు , ఏడాదిగా షార్ట్ ఫార్మాట్ టీమ్‌లోని లేని గిల్‌కు ఉన్నట్టుండి టీ20 వైస్- కెప్టెన్సీ ఇవ్వడం ఈ వాదనకు మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం టీమిండియాలో ప్రతి ఫార్మాట్‌కు వేర్వేరు కెప్టెన్లు ఉన్నారు. గిల్ టెస్టులకు కెప్టెన్‌గా ఉండగా, రోహిత్ వన్డేలకు, సూర్యకుమార్ యాదవ్ టీ20లకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమేనని ఫ్యూచర్‌లో టీమిండియా తిరిగి ఏక కెప్టెన్సీ విధానంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెలెక్టర్లు, బోర్డు, టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
పక్కా ప్రణాళికతోనే...
25 ఏండ్ల శుభ్‌మన్ గిల్‌ను టీ20లకు వైస్-కెప్టెన్‌గా ఎంపిక చేయడం వెనుక ఒక వ్యూహాత్మక ప్రణాళిక ఉందని స్పష్టమవుతోంది. ఏడాదికి పైగా టీ20 క్రికెట్ ఆడని గిల్‌కు ఇంత కీలక బాధ్యతలు అప్పగించడం కేవలం అతడి ఫామ్ ఆధారంగా మాత్రం కాదు. అతడిలో ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించే ఈ బాధ్యత ఇచ్చారని తెలుస్తోంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, గిల్‌లో ఉన్న కెప్టెన్సీ సామర్థ్యాలను ప్రత్యేకంగా ప్రశంసించాడు. అదే టైమ్‌లో విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ తర్వాత జట్టును ముందుండి నడిపించే సత్తా గిల్‌కు ఉందని బోర్డు , టీమ్ మేనేజ్‌మెంట్ బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది.
దేశవాళీ క్రికెట్‌లో, అలాగే ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్‌గా గిల్ తన సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఈ అనుభవం అతడికి అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఒక గట్టి పునాది వేసిందని చెప్పొచ్చు. సెలెక్టర్లు లాంగ్ టర్మ్ ప్లానింగ్‌లో భాగంగానే గిల్‌కు టీ20 వైస్ కెప్టెన్సీ ఇచ్చారని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ అంటున్నాడు. ‘ఆసియా కప్ టీమ్ ఎంపిక ప్రకటన సెలెక్టర్ల ఆలోచనా విధానాన్ని తెలియజేస్తుంది. శుభ్‌మన్‌ను ఎంపిక చేయడం ద్వారా, అతడు త్వరలో అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా మారబోతున్నాడని, ఆ స్థానంలో అతన్ని ఉంచుతున్నారని ఇది స్పష్టంగా చెబుతోంది. శుభ్‌మన్ చాలా గొప్ప ఆటగాడు. రాబోయే 12 నెలలు అతడి కెరీర్‌లో చాలా కీలకం కాబోతున్నాయి’అని నాయర్ అభిప్రాయపడ్డాడు.
ఇక శుభ్‌మన్ శకం..
ప్రస్తుతం రోహిత్ శర్మ వయస్సు 38 సంవత్సరాలు. అతడి ఫిట్‌నెస్ , భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని 2027 వన్డే వరల్డ్ కప్ నాటికి ఇండియా క్రికెట్ భవిష్యత్తు బాధ్యతలను గిల్ భుజాలపై మోపేందుకు సెలెక్టర్లు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్.. రోహిత్ వన్డేల నుంచి తప్పుకుంటే ఆటోమేటిక్‌గా ఆ ఫార్మాట్ పగ్గాలు అందుకోవడం ఖాయమే. కోహ్లీ తర్వాత ఆ స్థాయి టాలెంట్ ఉన్న బ్యాటర్‌గా మారిన గిల్ తిరిగి రావడంతో టీ20 కెప్టెన్ సూర్యపై పరోక్షంగా ఒత్తిడి పడనుంది. తన కెప్టెన్సీలో టీ20 టీమ్ సూపర్ సక్సెస్‌లో ఉన్నా.. బ్యాటర్‌గా సూర్య గత పది మ్యాచ్‌ల్లో ఫ్లాప్ అయ్యాడు. బ్యాటర్‌గా మెరుగవ్వకపోయినా.. ఆసియా కప్‌లో జట్టు ఫెయిలైనా సూర్యకుమార్ కెప్టెన్సీకి ముప్పు మొదలవ్వొచ్చు. మరోవైపు టీమిండియాలో మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటం వల్ల సమన్వయం లోపిస్తుందని, ముగ్గురు కెప్టెన్లు వేర్వేరు పవర్ సెంటర్లుగా మారితే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం దెబ్బతినే అవకాశం ఉందన్న వాదన ఎప్పటి నుంచో ఉంది.
అదే సమయంలో ఒకే కెప్టెన్ ఉండటం వల్ల జట్టులో స్థిరత్వం ఉంటుందని భావిస్తున్నారు. తాజా నిర్ణయం ద్వారా గిల్ భవిష్యత్తులో ఆల్-ఫార్మాట్ ప్లేయర్ గానే కాకుండా, ఆల్-ఫార్మాట్ కెప్టెన్ గా కూడా ఎదిగే అవకాశం ఉంది. ఇక గిల్‌లో కేవలం నాయకత్వ లక్షణాలే కాకుండా, ఆట పట్ల అతడి అంకితభావం కూడా సెలెక్టర్లు, బోర్డు, టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకుంటోందని అని చెప్పొచ్చు. ఇంగ్లండ్‌తో లాంగ్ టెస్ట్ సిరీస్ తర్వాత కూడా దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరపున ఆడటానికి అతను రెడీ అయ్యాడు. ఈ దృఢ సంకల్పమే అతడిపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతోంది. ఏదేమైనా విరాట్, రోహిత్ తర్వాత టీమిండియాకు ఒకే కెప్టెన్ ఉండాలని సెలెక్టర్ల, బోర్డు, టీమ్ మేనేజ్‌మెంట్ డిసైడైతే అందరి మదిలోకి వచ్చే ఏకైక ఆప్షన్ శుభ్‌మన్ గిల్ అనడంలో సందేహం లేదు.
ముప్పు శాంసన్‌కే...
టీ20ల్లోకి గిల్ ఎంట్రీతో ఇప్పుడు షార్ట్ ఫార్మాట్ టీమ్ కాంబినేషన్‌లో కొన్ని మార్పులు అనివార్యం. వైస్ కెప్టెన్‌గా తను తుది జట్టులో ఉండటం ఖాయం. ఈ ఐపీఎల్‌లో ఓపెనర్‌గా 650 రన్స్ చేసిన గిల్, టీమిండియాలో కూడా టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ లెక్కన ప్రస్తుతం టీ20 టీమ్‌లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తున్న సంజూ శాంసన్ ప్లేస్‌కు ఎసరు వచ్చిన్టటే. అగార్కర్ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా ధ్రువీకరించాడు. ‘శుభ్‌మన్, యశస్వి అందుబాటులో లేనందుకే శాంసన్ జట్టులో ఆడాడు’ అని చేసిన వ్యాఖ్యలు అతని స్థానంపై ప్రశ్నలు రేపాయి. మరోవైపు, అభిషేక్ శర్మ ప్లేస్ మాత్రం సురక్షితమన్నాడు. అభి పవర్ హిట్టింగ్ పెర్ఫామెన్స్ చూసిన తర్వాత అతన్ని వదులుకోలేని ప్లేయర్‌గా చేశాయని అగార్కర్ స్పష్టం చేశాడు. దాంతో శాంసన్ బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉంది.