నసీబ్  ఉంటేనే డబుల్ ఇల్లు..   560 ఇండ్లకు 3 వేల మంది పోటీ!

నసీబ్  ఉంటేనే డబుల్ ఇల్లు..   560 ఇండ్లకు 3 వేల మంది పోటీ!

గద్వాల, వెలుగు: డబుల్​ బెడ్రూమ్​ ఇల్లు పొందేందుకు అర్హులైన పేదలు, అధికారులు నిర్వహించే లక్కీ డిప్​లో తమ పేరు రావాలని ఆశిస్తున్నారు. అర్హుల  లిస్ట్ లో పేరున్నా ఒక్కో ఇంటికి నలుగురు చొప్పున పోటీ పడడంతో అధికారులు లక్కీ డిప్​ ద్వారా ఎంపిక  ప్రక్రియ చేపట్టనున్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కంప్లీట్  అయ్యాయి. వాటిని పంపిణీ చేసేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. మొదటి విడతలో గద్వాల పట్టణానికి చెందిన 4,160 మంది, రెండో విడతలో 989 మంది అప్లై చేసుకున్నారు. 5,149 దరఖాస్తులపై ఆఫీసర్లు రెండు సార్లు ఎంక్వైరీ చేశారు. ఒక ఇంటికి నలుగురు చొప్పున పోటీ పడుతున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

గద్వాలకు 560 ఇండ్లే..

పట్టణంలో 560 ఇండ్లు పంపిణీ చేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది. పట్టణం సమీపంలోని దౌదర్పల్లి దర్గా దగ్గర 1,275 ఇండ్ల నిర్మాణం చేపట్టగా, 560 కంప్లీట్ అయ్యాయి. గద్వాల మండలం గోన్పాడు విలేజ్  దగ్గర 25 ఇండ్లు కంప్లీట్ చేశారు. 1,275లో 715 ఇండ్లు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. గోన్పాడు దగ్గర ఉన్న 25 ఇండ్లతో పాటు పనులు కొనసాగుతున్న 715 ఇండ్లను గద్వాల పట్టణవాసులకు కాకుండా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. అర్హుల జాబితాలో గద్వాల పట్టణానికి చెందిన 3,000 మంది వరకు ఉన్నారు. వీరిలో 560 మందికి ఇండ్లు ఇచ్చే అవకాశం ఉండగా, మిగిలిన వారి పరిస్థితి ఏమిటనే విషయంపై అధికారులు, ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదు. 

ప్లాట్లు గుంజుకున్న వారికి..

గతంలో నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల స్థలాన్ని ప్రభుత్వం గుంజుకొని డబుల్  ఇండ్లు కట్టగా, 300 బెడ్స్  హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ నిర్మిస్తున్నారు. స్థలాలు తీసుకున్న వారికి డబుల్  బెడ్రూమ్  ఇండ్లు ఇస్తామని చెప్పి, ఇప్పుడు వారి ఊసేత్తడం లేదు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లగా, ఎలాంటి షరతులు లేకుండా ఇండ్లు ఇవ్వాలని కోర్టు చెప్పింది. అయినప్పటికీ వారి గురించి పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 

డిప్  ద్వారానే కేటాయిస్తాం..
 

అర్హులైన వారికి లక్కీ డిప్​ ద్వారా డబుల్  బెడ్రూమ్  ఇండ్లను కేటాయిస్తాం. కోర్టుకు వెళ్లిన వారికి కొన్ని ఇండ్లు తీసి పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మిగిలిన ఇండ్లు కంప్లీట్  అయ్యాక మిగిలిన వారికి డిప్  ద్వారా అందజేస్తాం. -  రాములు, ఆర్డీవో