
- ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల వినతితో హామీ ఇచ్చిన సీఎం రేవంత్
- స్టేడియం నిర్మాణానికి విధివిధానాల తయారు చేయాలని ఆదేశం
- జిల్లా ఇన్ చార్జ్ మంత్రి రివ్యూ మీటింగ్ లోనూ రెండుసార్లు చర్చ
- స్టేడియం నిర్మాణంపై కలెక్టర్ తో పాటు అధికారులకు ఆర్డర్
- పదేండ్ల పాలనలో ప్రచారానికే పరిమితమైన బీఆర్ఎస్ నేతలు
వరంగల్, వెలుగు : ఓరుగల్లులో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఇటీవల జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల వినతితో సీఎం రేవంత్ రెడ్డి స్పందించి హామీ ఇచ్చారు. ఆ వెంటనే వరంగల్ లో స్టేడియం నిర్మాణానికి విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత నెల20న హైదరాబాద్‍లో ముఖ్యమంత్రిని స్టేషన్ ఘన్‍పూర్, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, పరకాల, పాలకుర్తి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్‍రెడ్డి, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, యశస్వినిరెడ్డి కలిసి.. ఓరుగల్లులో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారని, హైదరాబాద్ మాదిరిగానే ఇంటర్నేషనల్ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే నెల 26న సెక్రటేరియట్‍లో ఉమ్మడి వరంగల్ జిల్లా రివ్యూ మీటింగ్ లోనూ, తాజాగా మూడు రోజుల కింద గ్రేటర్ వరంగల్ డెవలప్‍మెంట్ రివ్యూలోనూ స్టేడియం నిర్మాణ ప్రతిపాదనలపైనా ఇన్ చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చించారు. స్టేడియం నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించాలని కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో వరంగల్ లో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణం దిశగా నిర్ణయం జరిగింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టులన్నింటిని ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తోంది.
ఉనికిచర్ల వద్ద సర్కారు భూమి
గ్రేటర్ వరంగల్ సిటీలో విలీన గ్రామమైన ఉనికిచర్లలో కాకతీయ అర్బన్ డెవలప్‍మెంట్ అథారిటీ (కుడా)కి చెందిన సుమారు135 ఎకరాల సర్కారు భూమి నేషనల్ హైవే –163 పక్కనే ఉంది. ఇందులో కొంత భూమిని గతేడాది కుడా ‘ఉని సిటీ’ పేరుతో ప్లాట్లు చేసి అమ్మింది. అదే సర్వే నంబర్.325లో స్పోర్ట్స్ స్కూల్ కు మరో 20 ఎకరాలు కేటాయించడంతో పాటు ఇంకో 30 ఎకరాలు స్టేడియం నిర్మాణానికి కావాల్సిన భూమి ఉంది. ఈ భూమిపైనే ముఖ్యమంత్రి వద్ద అధికారులు ప్రస్తావించారు. స్టేషన్ ఘన్‍పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలంలో ఉనికిచర్ల ఉన్నప్పటికీ..సిటీ పరిధిలో ఉండే వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ సెగ్మెంట్లకు సమీపంలోనే ఉంది. అంతేగాక హైదరాబాద్, కరీంనగర్‍తో పాటు ములుగు, భూపాలపల్లి జిల్లాల నుంచి వచ్చేవారికి రింగురోడ్డు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రచారమే..
2016 మొదట్లో వరంగల్ సిటీ పర్యటనకు సీఎం కేసీఆర్ వచ్చారు. వరంగల్ సిటీని హైదరాబాద్ లెక్కనే అభివృద్ధి చేస్తామని, అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ వెళ్లగానే బీసీసీఐ బృందం వరంగల్ వచ్చి కావాల్సిన స్థలసేకరణ ఫైనల్ చేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా 2017 నవంబర్‍లో మంత్రి కేటీఆర్ గ్రేటర్ వరంగల్ లో పర్యటించారు. గ్రేటర్ సిటీలోని వరంగల్ తూర్పు, పశ్చిమతో పాటు పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో 4 స్టేడియాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అన్ని ఎన్నికల్లోనూ వరంగల్ లో స్టేడియాల పేరుతో భారీ హోర్టింగులు, సోషల్ మీడియాలోనూ ప్రచారం చేసుకున్నారు. కానీ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో స్టేడియానికి కనీసం స్థలసేకరణ కూడా చేయలేదు.