- హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్ వెల్లడి
ఏటూరునాగారం/తాడ్వాయి వెలుగు : మేడారం జాతరకు తరలివచ్చే భక్తుల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా అన్ని ఏర్పాటు చేశామని హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్ చెప్పారు. మేడారం పరిసర ప్రాంతాల్లో 30 మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయడంతో పాటు నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించారు. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 50 పడకల హాస్పిటల్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక వైద్య బృందాలను నియమించినట్లు చెప్పారు. టీటీడీ కల్యాణ మండలంలో ఏర్పాటు చేసిన హాస్పిటల్‌లో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వైద్య శాఖ ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్య సేవలు అందించి జాతర సేవలలో వైద్య ఆరోగ్య శాఖను ముందు వరుసలో ఉంచాలని సూచించారు.
అనంతరం మేడారం బస్టాండ్, జంపన్న వాగు, ఇంగ్లీష్ మీడియం స్కూల్, హరిత హోటల్ ఏరియాల్లోని ఏర్పాటు చేసిన క్యాంప్‌ను సందర్శించి సేవల గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో గోపాల్‌రావు, సమ్మక్క సారలమ్మ జాతర కో నోడల్ ఆఫీసర్, హనుమకొండ డీఎంహెచ్‌వో అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు విపిన్‌కుమార్, క్రాంతి కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్లు పవన్‌కుమార్, శ్రీకాంత్, మెడికల్ ఆఫీసర్స్ భవ్య శ్రీ, మోనికా సంజీవరావు పాల్గొన్నారు.
