జనం అరిగోస పడ్తున్నరు

జనం అరిగోస పడ్తున్నరు
  • వరద నివారణకు ఇస్తామన్న 250 కోట్లు రెండేండ్లయినా రాలే
  • అరిగోస పడ్తున్న నగరవాసులు 

వరంగల్‍, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. నాలాలు, డ్రైనేజీలు కట్టట్లేదు. రోడ్ల గుంతలు పూడ్చుతలేరు. మేయర్ గుండు సుధారాణి డివిజన్ లో 10 నెలల కింద డ్రైనేజీ కోసమని ఇండ్ల ముందు నుంచి పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టి పనులు చేస్తలేరు. దీంతో అక్కడి జనం అరిగోస పడ్తున్నరు. ఇండ్లళ్లకు పోవడానికి మోరీపై చెక్కలు వేసుకున్నరు. పనులు ఎందుకు చేస్తలేరు అని జనం అడిగితే... ప్రభుత్వం నుంచి పైసలు రావాలని, వచ్చినంక చేస్తమని లీడర్లు, ఆఫీసర్లు చెబుతున్నారు. ‘‘గ్రేటర్‍ వరంగల్ లో అభివృద్ధి పనుల కోసం రూ.300 కోట్లతో డీపీఆర్‍లు సిద్ధం చేశాం. ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించాం. త్వరలోనే ఫండ్స్ మంజూరు చేస్తామని సీఎం మాట ఇచ్చారు. అవి రాగానే టెండర్లు పిలుస్తాం. పెండింగ్ పనులన్నీ చేస్తాం” అని అంటున్నారు. 15 నెలల సంది గిదే ముచ్చట చెబుతున్నారు. 

ఖాళీ చేసి పొమ్మంటున్నరు

ఒక్క నాలాలు, డ్రైనేజీలు, రోడ్ల పనులే కాదు..  రూ.72.50 కోట్లతో చేపట్టాల్సిన భద్రకాళి బండ్‍, రూ.12.50 కోట్ల వడ్డెపల్లి బండ్‍ పనులు, వరంగల్‍ పోతన నగర్‍, హనుమకొండ రెడ్డి కాలనీల్లో నిర్మించాల్సిన దోబీఘాట్లు, రూ.250 కోట్లతో ఉర్సు, కాజీపేట బంధం చెరువుల వద్ద ఏర్పాటు చేయాల్సిన మురుగునీటి శుద్ధి కేంద్రాలు, రూ.143 కోట్లతో బొందివాగు నాలా పనులు.. దేని గురించి అడిగినా రూ.300 కోట్ల పాటే పాడుతున్నరు. 

మళ్లీ మునిగిన కాలనీలు... 

గ్రేటర్‍ వరంగల్​లో 66 డివిజన్లు ఉండగా.. వాటిలో 183 మురికివాడలు, 43 లోతట్టు కాలనీలు ఉన్నాయి. రెండేండ్ల కింద ఆగస్టులో వచ్చిన వరదలకు నగరమంతా నీట మునిగింది. అప్పుడు మంత్రి కేటీఆర్ సిటీలో పర్యటించి, వరద ముంపుకు నాలాల ఆక్రమణే కారణమని చెప్పారు. ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.250 కోట్లు మంజూరు చేస్తామని.. వాటితో నాలాల విస్తరణ, కొత్త డ్రైనేజీలు, కల్వర్టులు, రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ రెండేండ్లయినా పైసా విడుదల చేయలేదు. ఈ ఏడాది ఏప్రిల్ లోనూ వెంటనే రూ.200 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించినా, అవి కూడా రాలేదు. నాలాల విస్తరణ చేపట్టకపోవడంతో మొన్నటి వానలకు బొందివాగు ఉప్పొంగి హంటర్ రోడ్డులోని ఎన్‍టీఆర్‍ నగర్‍, బృందావన్‍ కాలనీ, సాయినగర్‍, సంతోషి మాత టెంపుల్‍ ఏరియా, శివనగర్‍, పెరకవాడ తదితర 18 కాలనీలు నీట మునిగాయి. ఇండ్లలోకి నడుం లోతు వరద రావడంతో జనం ఇండ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. బొందివాగు నాలా విస్తరణ, అభివృద్ధి కోసం రూ.143 కోట్లతో డీపీఆర్‍ సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపామని, నిధులు రాగానే పనులు ప్రారంభిస్తామని మేయర్ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. కాగా, ఇటీవల కాంట్రాక్టర్లకు ఇచ్చిన 127 చెక్కులు బౌన్స్ అయ్యాయి. కాంట్రాక్టర్లు పనులు ఆపేస్తామనడంతో మళ్లీ కొత్త చెక్కులిచ్చి కొన్ని బిల్లులు చెల్లించారు. 

మేయర్‍ డివిజన్‍.. మరీ డేంజర్‍ 

మేయర్ సుధారాణి డివిజన్ (29)లో పరిస్థితి డేంజర్​గా ఉంది. ఓపెన్ నాలాలు, డ్రైనేజీలు, గుంతల రోడ్లతో జనం ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ కడ్తమని 10  నెలల కింద చేపట్టిన తవ్వకాలు కాలువలను తలపిస్తున్నాయి. రామన్నపేటలోని పాపయ్యపేట్‍లో ఇండ్ల ముందు దాదాపు 10 నుంచి 15 అడుగులు తవ్వి వదిలేశారు. దీంతో ఇండ్లలోకి వెళ్లే దారి లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోకి వెళ్లడానికి, బైకులు తీసుకుపోవడానికి వెదురు తడకలు వేసుకున్నారు. దాని పైనుంచి వెళ్లే క్రమంలో చాలా మంది తవ్విన గోతుల్లో పడి.. కాళ్లు, చేతులు విరిగాయి. కొన్ని వెహికల్స్​ పడి డ్యామేజీ అయ్యాయి. వాన పడితే వరద పెద్ద ఎత్తున వస్తుండడంతో బయటకు రాలేకపోతున్నారు. 

నిలదీస్తున్న సొంత పార్టీ లీడర్లు... 

డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టకపోవడంపై మేయర్​ను సొంత పార్టీ లీడర్లే నిలదీస్తున్నారు. ఈ నెల 1న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍, డిప్యూటీ మేయర్‍ రిజ్వానా షమీమ్‍తో పాటు 17 మంది కార్పొరేటర్లు మేయర్‍ సుధారాణిని కలిసి తమ డివిజన్లలో పనులు చేపట్టకపోవడంపై ప్రశ్నించారు. ఇదే నెల 4న నిర్వహించిన కౌన్సిల్‍ మీటింగులో విలీన గ్రామాలను అసలే పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‍ ఆవేదన వ్యక్తం చేశారు. సిటీలోని గుంతల రోడ్లపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య 
ప్రశ్నించారు. 

ఖాళీ చేసి పొమ్మంటున్నరు

మోరీ కడ్తమని చెప్పి 10 నెలల కింద పెద్ద కాలువ తవ్విన్రు. ఆ తర్వాత పనులు ఆపిన్రు. ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు రెండ్రోజులు చేస్తున్నరు. ఇంట్లోకి పోవడానికి దారి లేక మేమే వెదురు కర్రలు వేసుకున్నం. దానిపై నడవాలంటే భయమైతంది. లీడర్లు వచ్చినప్పుడు అడిగితే.. అంత భయమైతే ఇండ్లు ఖాళీ చేసి పొమ్మంటున్రు. 

- పుప్పాల వెంటకలక్ష్మి, రామన్నపేట

ఇంట్లకెళ్లి ఎళ్లక 10 నెలలైంది.. 

ఈ అవ్వ పేరు దేవునూరి భవాని. మేయర్ సుధారాణి డివిజన్ లోని పాపయ్యపేట్ లో ఉంటోంది. ఇక్కడ 10 నెలల కింద డ్రైనేజీ కోసం పెద్ద మోరీ తవ్విన్రు. కానీ పనులు చేపట్టకపోవడంతో 10 నెలలుగా అడుగు బయట పెట్టలేదని అవ్వ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ‘‘గతంలో కాలనీలోని బంధువులు, తెలిసినోళ్ల ఇండ్లకు వెళ్లేదాన్ని. ఇప్పుడు పెండ్లీలు, చావులకు కూడా పోతలేను. నా కళ్లముందే ఇద్దరు ముగ్గురు గుంతలో పడ్డరు” అని వాపోయింది. 

దారి లేక మోరీలో పడ్డరు.. 

మా డివిజన్​లో తవ్విన పెద్ద మోరీ లో ఈ దారిలో పోయేటోళ్లు మస్తు మంది పడ్డరు. అటు మోరీ కోసం తవ్విన కాలువ.. ఇటు మిగిలిన దారిపై ఇసుక, కంకర ఉండడంతో రోడ్డు లేకుండా పోయింది. వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది అవుతోంది.  

- జి.సంతోష్, పాపయ్యపేట్‍