
భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల కారణంగా ఇండియాలో మూసివేసిన ఎయిర్ పోర్టులు తిరిగి ప్రారంభం అయ్యాయి. మే 15 వరకు ఎయిర్ పోర్టులను మూసివేస్తున్నట్లు గతంలో ప్రకటించిన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా.. రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించడంతో 32 ఎయిర్ పోర్టులను తిరిగి ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టి పెట్టుకుని.. విమానాల స్థితిని నేరుగా ఎయిర్ పోర్ట్ సంస్థలతో తనిఖీ చేసుకోవాలని.. అలాగే ఎప్పటికప్పుడు వారి వెబ్‌సైట్‌లను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలని సూచించింది. 9న 24 ఎయిర్ పోర్టులను మూసివేస్తున్నట్లు ప్రకటించగా.. మరుసటి 32 ఎయిర్ పోర్టులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మే10న ప్రకటించారు.
రీ ఓపెన్ అయిన 32 ఎయిర్ పోర్టులివే..
జైసల్మేర్, జామ్‌నగర్, జోధ్‌పూర్, అధంపూర్, అంబాలా, అవంతిపూర్, బతిండా, భుజ్, బికనీర్, హల్వారా, హిందన్, జమ్మూ, కాండ్లా, కాంగ్రా (గగ్గల్), కేశోడ్, కిషన్‌గఢ్, కులు మనాలి (భుంటార్), లేహ్, లూధియానా, ముంద్రా, నలియా, పఠాన్‌కోట్, పాటియాలా, పోర్బందర్, రాజ్‌కోట్ (హిరాసర్), సర్సావా, సిమ్లా, థోయిస్ , ఉత్తర్‌లై ఎయిర్ పోర్టులు తెరుచుకున్నాయి.ఇండిగో , స్పైస్‌జెట్‌తో సహా అనేక ప్రధాన విమానయాన సంస్థలు కూడా ఈ విమానాశ్రయాలలో తమ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి.
బార్డర్ లో ప్రశాంతత
మరో వైపు భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత పరిస్థితులు మధ్య మొదటిసారి నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది. 'నిన్న రాత్రి అంతర్జాతీయ సరిహద్దు వెంట జమ్మూ కశ్మీర్ సహా ఇతర ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఎలాంటి కాల్పులు జరగలేదు.ఇటీవలి కాలంలో మొదటి సారి ప్రజలు రా త్రిపూట ప్రశాంతంగా గడిపారు' అని ఇవాళ భారత సైన్యం ప్రకటించింది. పాకిస్తాన్ జరిపిన కాల్పులు, డ్రోన్ల దాడితో ఇంతకాలం సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు తిరిగి సొంత ఇళ్లకు వచ్చే ఆలోచన చేస్తున్నారు.