
ప్రపంచమంతా కరోనా భయం గుప్పెట్లో ఉన్న సమయంలోనూ మహిళలపై అకృత్యాలు ఆగడంలేదు. ఉత్తరప్రదేశ్ లోని సంత్ రావిదాస్ నగర్ జిల్లాలో ఈ నెల 10వ తేదీన ఓ వివాహిత మహిళపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఎవరికైనా చెబితే ఆమెతో పాటు భర్తను కూడా చంపేస్తామనడంతో భయం భయంగా ఉన్న ఆమె శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని శనివారం చెప్పారు పోలీసులు.
ఫోన్ లో వీడియో తీసి..
యూపీలోని సంత్ రవిదాస్ నగర్ జిల్లాలోని గోపీగంజ్ సమీపంలో 32 ఏళ్ల మహిళపై డ్రగ్స్ కు అడిక్ట్ అయిన నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. మే 10న కట్టెపుల్లల కోసం ఊరి చివరికి వెళ్లిన ఆ వివాహిత మహిళపై సోనూ బింద్, దీపక్ సింగ్, అచే లాల్, మాధవ్ యాదవ్ అనే నలుగురు అత్యాచారం చేశారు. ఈ దారుణాన్ని వాళ్లు ఫోన్ లో వీడియో తీసి.. రేప్ గురించి ఎవరికైనా చెబితే ఆ మహిళను, ఆమె భర్తను హత్య చేస్తామంటూ బెదిరించి పరారయ్యారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయిన ఆమె కొద్ది రోజుల తర్వాత భర్త వద్ద తనపై జరిగిన అకృత్యం గురించి చెప్పింది. అతడు ధైర్యం చెప్పి ఒత్తిడి చేయడంతో శుక్రవారం గోపీ గంజ్ స్టేషన్ లో ఆ మహిళ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు, ఆమె భర్త ఇద్దరూ కలిసి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారని జ్ఞాన్ పూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కాళూ సింగ్ చెప్పారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చేపడుతున్నామని తెలిపారు.