దేశ సేవలో కొత్తపల్లి .. ఒకే ఊరి నుంచి 33 మంది సైనికులు

దేశ సేవలో కొత్తపల్లి .. ఒకే ఊరి నుంచి 33 మంది సైనికులు
  • కశ్మీర్ బార్డర్ సహా ఇతర ప్రాంతాల్లో విధులు
  • ఇండియా-పాక్ పరిస్థితులతో అందరిలో టెన్షన్
  • తమకు మాత్రం గర్వంగా ఉందంటున్న గ్రామస్తులు, జవాన్ల తల్లిదండ్రులు

హనుమకొండ/ భీమదేవరపల్లి, వెలుగు: అది హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం. పోరాటాలకు పురిటిగడ్డగా వెలుగొందిన ఆ ఊరు ఒకప్పుడు నక్సల్స్ కు కంచుకోట. ఎంతోమంది విప్లవ వీరులను తయారు చేసి, ఉద్యమాల బాట పట్టించింది. ఇప్పుడు అదే ఊరు దేశ సేవకు అంకితమైంది. గ్రామంలోని యువకులంతా సైన్యంలో చేరి దేశం కోసం పని చేస్తున్నారు. కొత్తపల్లి నుంచి ఇప్పటి వరకు 33 మంది సైన్యంలో చేరగా, వారంతా జమ్మూ కశ్మీర్​ బార్డర్​తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఇండియా--–పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణంతో జనాల్లో టెన్షన్ నెలకొనగా, కొత్తపల్లి గ్రామస్తులు, జవాన్ల తల్లిదండ్రులు మాత్రం దేశం కోసం తమ బిడ్డలు పోరాడుతుండటం గర్వాన్నిస్తోందని చెబుతున్నారు.

ఒక్కడితో మొదలై.. 

దాదాపు నాలుగు వేల జనాభా ఉన్న కొత్తపల్లిలో ఇదివరకు నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండేది. కాగా గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రాజయ్య, రాజమ్మ దంపతుల పెద్ద కొడుకు ఎర్రగొల్ల కుమారస్వామి కరీంనగర్ లో ఇంటర్​ చదువుతున్న సమయంలోనే అక్కడి లెక్చరర్ల ప్రోత్సాహంతో 2001లో సైన్యంలో చేరాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ కమ్యూనికేషన్ కోర్ లో పని చేస్తున్నాడు. మొదట ఆయన సైన్యంలో చేరగా, తర్వాత తన తముళ్లు ఎర్రగొల్ల రాజు, ఎర్రగొల్ల తిరుపతిని కూడా ఆర్మీలో చేరేలా ప్రోత్సహించడంతో వారూ సైన్యంలో చేరారు. ముగ్గురూ ఆర్మీలో పని చేస్తూనే సెలవుల్లో స్వగ్రామానికి వచ్చి, స్థానిక యువతను కూడా దేశ సేవ కోసం సైన్యంలో చేరేలా ప్రోత్సహించేవారు. 

వారికి కావాల్సిన స్టడీ మెటీరియల్స్​ప్రిఫర్​ చేయడంతోపాటు ఫిట్​నెస్​ కోసం కసరత్తులు కూడా చేయించేవారు. దీంతో విడతల వారీగా గ్రామం నుంచి మొత్తం 33 మంది యువకులు ఆర్మీలో చేరారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎన్​ఎస్​జీ తోపాటు వివిధ విభాగాల్లో జాయిన్​అయ్యారు. అందులో ఆడెపు చంద్రశేఖర్, పున్నం శ్రీధర్, పుట్ట రాజు, బోనాల ప్రవీణ్, ఎట్టపు రాజు, మేకల రజనీకాంత్, మేకల విజయ్, మేకల శ్రీను, మేకల రాములు, పున్నం జీవన్, కొప్పుల రఘు, సట్ల వేణు, వేల్పుల నవీన్, గుడికందుల నవీన్, మహేశ్, సర్జన శ్రీకాంత్, కొప్పుల సురేశ్, మేకల పవన్, కూన సాయినాథ్, మేకల యశ్వంత్ తదితరులున్నారు. కాగా, గ్రామం నుంచి సైన్యంలో చేరినవారిలో సుమారు 15 మంది వరకు జమ్మూ కశ్మీర్​లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఎర్రగొల్ల రాజు ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకోగా, మిగతా వాళ్లంతా ఇండియన్​ ఆర్మీలోని వివిధ విభాగాల్లో పంజాబ్, యూపీ, కర్నాటకలో పని చేస్తున్నారు. 

తల్లిదండ్రులూ ఆదర్శమే..

దేశ సేవలో ముందుండి పోరాడుతున్న ఆర్మీ జవాన్లను చూసి అందరూ సలాంలు కొడతారు. శభాష్ అంటూ మెచ్చుకుంటారు. కానీ తామో లేక తమ కుటుంబం నుంచో ఒకరినైనా ఆర్మీకి పంపించమంటే మాత్రం చాలామంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ కొత్తపల్లిలోని తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డలను దేశ సేవకే అంకితం చేస్తున్నారు. దేశంలోని ఏదో ఒక చోట ఆర్మీ జవాన్లపై  దాడులు జరిగినప్పుడు ఇక్కడున్న తల్లిదండ్రుల గుండెలు అదురుతూనే ఉంటాయి. అయినా కుటుంబంలో ఒక్క కొడుకున్నా ఏ మాత్రం సంకోచించకుండా సైన్యంలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో ఒక్కొక్కరు ఆర్మీలో జాయిన్ కాగా, మరికొన్ని కుటుంబాల్లో ఉన్న ముగ్గురూ సైన్యం బాట పట్టడం గమనార్హం. గ్రామానికి చెంది మేకల స్వరూప, సారయ్యల కొడుకులు ఇద్దరూ రజనీకాంత్, శ్రీనివాస్ జమ్మూ కశ్మీర్లో విధులు నిర్వహిస్తుండగా, కొప్పుల కొమురయ్య-రాజమణిల కొడుకులు రఘు, సురేశ్, హరీశ్ కూడా జవాన్లుగా దేశ భద్రతలో భాగమయ్యారు. 

గర్వంగా ఫీలవుతున్నరు..

ప్రస్తుతం భారత్-–పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అందరి గుండెలు అదురుతున్నాయి. కొత్తపల్లికి చెందిన సైనికుల తల్లిదండ్రుల్లోనూ కొంతమేర ఆందోళన వ్యక్తమవుతున్నా, తమ కొడుకులు దేశం కోసం పోరాటం చేస్తున్నారంటూ గర్వం వారిలో కనిపిస్తోంది. గ్రామంలోని కుటుంబాలు తమ వ్యక్తిగత బంధాలకు కాకుండా దేశ సేవకు ప్రాధాన్యం ఇస్తుండటం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుండగా, పరిపూర్ణ దేశభక్తికి కొత్తపల్లి ప్రత్యక్ష సాక్ష్యంగా వెలుగొందుతోంది.

గర్వంగానే అనిపిస్తాంది..

మా కొడుకు జీవన్ కొన్నేండ్ల కింద ఆర్మీలో చేరి జమ్మూ కశ్మీర్ లో పని చేస్తున్నడు. ఇప్పుడు ఇండియా–-పాకిస్తాన్​ దేశాల మధ్య జరుగుతున్న పోరులో తనవంతుగా పాత్ర పోషిస్తుండు. మా కొడుకు బార్డర్​లో పని చేస్తున్నాడనే భయం కన్నా దేశానికి సేవ చేస్తున్నాడనే గర్వమే ఎక్కువుంది. 

పున్నం రాజమ్మ-పోచయ్య, కొత్తపల్లి

ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడు ఉండాలి..

మా కొడుకు రాజు దేశానికి సేవ చేస్తనని ఆర్మీలో చేరిండు. మా దగ్గర లేడన్న బాధ ఉంటది. కానీ దానికంటే దేశానికి సేవ చేస్తున్నడనే విషయం ఎక్కువ ఆనందాన్నిస్తది. పండుగలు వస్తే కొడుకులు వస్తే బాగుండని తలుచుకుంటం. కానీ దేశ సేవలో ఉన్నడని యాది చేసుకుని నిమ్మలపడుతం. ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడిని అందించేందుకు తల్లిదండ్రులు కూడా ముందుకురావాలి. 

పుట్ట లక్ష్మీ-వెంకటస్వామి, బీఎస్​ఎఫ్​ జవాన్ పుట్ట రాజు తల్లిదండ్రులు