
- 336 కొనుగోలు కేంద్రాలు
- ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
సూర్యాపేట/ యాదాద్రి , వెలుగు: వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వడ్లు కొనుగోలు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈసారి 4.30 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని సివిల్ సప్లయ్ శాఖ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ మేరకు జిల్లాలో 336 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని వేర్వేరుగా కొనుగోలు చేయనున్నారు.
మరో 20 రోజుల్లో వరి కోతలు
జిల్లా వ్యాప్తంగా రైతులు 4.82 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. బోరుబావుల కింద, మూసీ, సాగర్ ఆయకట్టులో విడతల వారీగా పంట వేశారు. బోరుబావుల కింద సాగైన వరి మరో 20 రోజుల్లో కోతకు రానుంది. ప్రణాళిక ప్రకారం ఐకేపీ ఆధ్వర్యంలో 168, పీఏసీఎస్, ఇతరుల ఆధ్వర్యంలో 36 చొప్పున సెంటర్లను నడపాలని అధికారులు నిర్ణయించారు.
దాదాపు 10.30 లక్షల టన్నుల దిగుబడి అంచనా
జిల్లాలో దాదాపు 10.30 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. వానాకాలం సాగు చేసిన పంటలో సన్న రకం వడ్లను కొంతవరకు రైతులు ఇంటి అవసరాల కోసం వాడుకుంటారు. ప్రైవేట్మార్కెట్లు, మిల్లులకు పోగా.. దాదాపు 2,36,289 టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. అలాగే, 1,94,591 టన్నుల దొడ్డు రకం వడ్లు అమ్మకానికి వస్తాయి.
మొత్తం 1.07 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయి. ప్రస్తుతం జిల్లాలో 45 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మరో 12 లక్షలు త్వరలోనే సరఫరా కానున్నాయి. మిగతా వాటిని సెంటర్ల ప్రారంభం నాటికి సమకూర్చనున్నారు.
యాదాద్రి జిల్లాలో 325 సెంటర్లు
యాదాద్రి జిల్లాలో వానాకాలం సీజన్ వడ్ల కొనుగోలుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా రైతులు ఈసారి 2.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 3.80 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు.
ఇందులో 80 వేల టన్నులను రైతుల అవసరాలతోపాటు మిల్లర్లు ప్రైవేట్ గా కొనుగోలు చేస్తారని భావిస్తున్నారు. మిగతా 3 లక్షల టన్నులను సేకరించాల్సి ఉంటుందన్న అంచనాతో 325 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈసారి నాట్లు ఆలస్యం కావడంతో నవంబర్ నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని చెబుతున్నారు. 75 లక్షల గన్నీ బ్యాగులు, 9,750 టార్పాలిన్లు, 325 తేమ మెషీన్లు, 500 వేయింగ్ మెషీన్లను రెడీగా ఉంచామనిపేర్కొన్నారు.
ఈ వారంలో సెంటర్లు ప్రారంభిస్తాం
ఈ వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎ–గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర ప్రకటించింది. సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నాం. ఈ నెల 20 నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉంది. - తేజస్ నంద్ లాల్ పవార్, కలెక్టర్