
కడెం, వెలుగు : నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్‌లో మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. పెద్దూర్ గ్రామానికి చెందిన ముత్యం అనే మత్స్యకారుడు సోమవారం రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వల వేయగా.. 34.5 కిలోల బరువున్న బొచ్చె రకం చేప పడింది. ఈ భారీ చేపను చూసి మత్స్యకారులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
గోదావరికి పెరుగుతున్న వరద
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : ఇటీవల కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద సోమవారం 10,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అయింది. గోదావరిలో రెండు రోజుల కిందటి వరకు రెండు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే ఉండేది. కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాణహిత నదిలో నీటి మట్టం పెరగడంతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుష్కరాల టైంలో వేసిన షెడ్లు నీటిలో మునిగిపోయాయి. వరద ప్రవాహం గోదావరి పుష్కరఘాట్లకు సమీపంలోకి చేరుకుంది. ప్రాణహిత వరద కారణంగా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో పెరగడంతో 85 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. గోదావరి తీర ప్రాంతాలపై దృష్టి పెట్టి, ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.