చిన్నచింతకుంటలో భారీగా నగదు పట్టివేత

చిన్నచింతకుంటలో భారీగా నగదు పట్టివేత

చిన్నచింతకుంట, వెలుగు: మండలంలోని లాల్ కోట చెక్ పోస్టు వద్ద ఎస్ఐ ఆర్  శేఖర్  సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తుండగా, నల్గొండకు చెందిన ఆరుగురు తమ వెంట తీసుకెళ్తున్న రూ.35.49 లక్షలు పట్టుపడ్డాయి. డబ్బులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశామని చెప్పారు. 

దేవరకద్రలో..

దేవరకద్ర మండల కేంద్రంలో సోమవారం పోలీసుల తనిఖీల్లో కారులో తీసుకెళ్తున్న రూ.15 లక్షలు పట్టుపడ్డాయి. కౌకుంట్ల మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పాలమూరు నుంచి వెళ్తుండగా, అమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద తనిఖీ చేయగా నగదు పట్టుబడింది. మరో వ్యక్తి రూ.2.11 లక్షలు తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు దేవరకద్ర ఎస్ఐ వెంకటేశ్​ తెలిపారు.

మక్తల్/మరికల్: నారాయణపేట జిల్లా మరికల్, మక్తల్​ పరిధిలోని హైవేపై తనిఖీలు చేపట్టి రూ.6.80 లక్షలు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరికల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో మహబూబ్​నగర్​ నుంచి నర్వ వెళ్తున్న వెంకటరాజ్​ కారులో రూ.3 లక్షలు, దేవరకద్ర నుంచి రాయచూర్​ వెళ్తున్న శ్రీశైలం కారులో రూ.50,500 నగదు పట్టుకున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్​రెడ్డి చెప్పారు.

అలాగే ఆత్మకూర్​ రోడ్​లో ఏలిగేండ్లకు చెందిన శేఖర్​గౌడ్​ ఆటోలో తరలిస్తున్న రూ.19 వేల విలువైన లిక్కర్​ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక మక్తల్​ నుంచి కృష్ణాకు వెళ్తున్న గుగ్గిల్ల రవికుమార్​ కారులో రూ.2 లక్షలు, వడ్వట్​ గ్రామానికి చెందిన ఎదిరే కిరణ్​కుమార్​ కారులో రూ.1.29 వేల నగదు పట్టుకున్నామని సీఐ రాంలాల్, ఎస్ఐ పర్వతాలు చెప్పారు. 

కోయిలకొండ: మండల కేంద్రం సమీపంలోని మైసమ్మగుడి వద్ద నిర్వహించిన తనిఖీల్లో కారులో తీసుకెళ్తున్న రూ.5 లక్షలు సీజ్ చేసినట్లు ఎస్ఐ విజయభాస్కర్  తెలిపారు. డబ్బులు తీసుకెళ్లేటప్పుడు ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. 
అలంపూర్: బెల్ట్ షాపులకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ రమేశ్​ తెలిపారు. పట్టణ సమీపంలోని  ర్యాలంపాడు బ్రిడ్జి వద్ద తనిఖీలు చేస్తుండగా రవి గౌడ్, బోయ పవన్ కళ్యాణ్  బైక్ పై 47 లీటర్ల లిక్కర్​ తీసుకెళ్తుండగా పట్టుకునట్లు చెప్పారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.