నకిలీ ఫింగర్‌‌‌‌ ప్రింట్స్‌‌‌‌తో 39 లక్షలు స్వాహా

నకిలీ ఫింగర్‌‌‌‌ ప్రింట్స్‌‌‌‌తో 39 లక్షలు స్వాహా
  •     పీఎం కౌశల్‌‌‌‌ వికాస్‌‌‌‌ యోజన సెంటర్‌‌‌‌లో స్టూడెంట్లు లేకున్నా ఉన్నట్లు అటెండెన్స్‌‌‌‌
  •     నకిలీ వేలిముద్రలతో బయోమెట్రిక్‌‌‌‌ వేస్తూ నిధులు కాజేసిన నిర్వాహకులు
  •     నలుగురిని అరెస్ట్‌‌‌‌ చేసిన పోలీసులు

గోదావరిఖని, వెలుగు : నకిలీ వేలిముద్రలు సృష్టించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందిన వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. వారి వద్ద నుంచి ఫేక్ ఫింగర్‌‌‌‌ ప్రింట్స్‌‌‌‌, రిజిస్ట్రేషన్‌‌‌‌ పేపర్లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌, బయోమెట్రిక్‌‌‌‌ మెషీన్‌‌‌‌, సెల్‌‌‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన స్కామ్‌‌‌‌ వివరాలను రామగుండంలో సీపీ ఎం. శ్రీనివాస్‌‌‌‌ వెల్లడించారు. 

ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్‌‌‌‌ వికాస్‌‌‌‌ యోజన స్కీమ్‌‌‌‌కు సంబంధించిన సెంటర్‌‌‌‌ను మంచిర్యాలలో నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు స్కిల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌లో ట్రైనింగ్‌‌‌‌ ఇస్తున్నందుకుగానూ ఒక్కో స్టూడెంట్‌‌‌‌కు రూ. 1,300 చొప్పున కేంద్ర ప్రభుత్వం సెంటర్‌‌‌‌ నిర్వాహకులకు అందజేస్తోంది. మంచిర్యాలలో నడుస్తున్న సెంటర్‌‌‌‌కు 50 మంది స్టూడెంట్లు మాత్రమే వస్తుండడంతో నిర్వాహకులకు తక్కువ మొత్తంలో డబ్బులు  వచ్చేవి. 

దీంతో భోపాల్‌‌‌‌లోని హెడ్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ నిర్వాహకుడు సాహిల్‌‌‌‌ వలీ, హైదరాబాద్‌‌‌‌ సెంటర్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జి ఆవునూరి శ్రీనివాస్‌‌‌‌ సూచనతో నకిలీ ఫింగర్‌‌‌‌ ప్రింట్స్‌‌‌‌ తయారు చేసే స్టూడెంట్ల హాజరు ఎక్కువ చూపేందుకు మంచిర్యాల సెంటర్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జి మల్లికార్జున్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ చేశాడు. ఇందులో భాగంగా నర్సంపేటకు చెందిన విజయ్, వెంకటేశ్వర్లు, సలీం జాఫర్‌‌‌‌ సహాయంతో 250 మంది ఫింగర్‌‌‌‌ ప్రింట్స్‌‌‌‌ తయారు చేశారు. 

వీటితో బయోమెట్రిక్‌‌‌‌ అటెండెన్స్‌‌‌‌ వేస్తూ రిపోర్ట్‌‌‌‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపించేవారు. ఇలా ఇప్పటివరకు రూ. 39 లక్షలు కాజేశారు. ఫేక్‌‌‌‌ ఫింగర్‌‌‌‌ ప్రింట్స్‌‌‌‌తో అటెండెన్స్‌‌‌‌ వేస్తున్న విషయాన్ని కొందరు వ్యక్తులు సీపీకి ఫిర్యాదు చేశారు. పూర్తి విషయాలు తెలుసుకోవాలని ఆయన మంచిర్యాల పోలీసులను ఆదేశంచారు. దీంతో మంచిర్యాల ఆఫీస్​ఇన్‌‌‌‌చార్జిగా పనిచేస్తున్న దేవేందర్‌‌‌‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దేవేందర్‌‌‌‌తో పాటు మల్లికార్జున్, సలీం జాఫర్, వెంకటేశ్వర్లును సోమవారం అరెస్ట్‌‌‌‌ చేశారు. ఈ స్కామ్‌‌‌‌లో ముఖ్య సూత్రధారులైన భోపాల్‌‌‌‌కు చెందిన సాహిల్‌‌‌‌ వలీ, హైదరాబాద్‌‌‌‌కు చెందిన ఆవునూరి శ్రీనివాస్‌‌‌‌ను త్వరలోనే అరెస్ట్‌‌‌‌ చేస్తామని సీపీ తెలిపారు.