స్టార్టప్​ యాప్​తో త్రీడి క్లాసులు

 స్టార్టప్​ యాప్​తో త్రీడి క్లాసులు

కష్టమైన పాఠాల్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం కోసం బ్లాక్​బోర్డ్ మీద బొమ్మలు వేస్తారు చాలామంది టీచర్లు.  కొందరేమో కలర్ పేపర్లు, అట్టముక్కలతో తయారుచేసిన బొమ్మలు వాడతారు. అయితే, స్కూల్ పిల్లల నుంచి కాలేజీ స్టూడెంట్ల వరకు సైన్స్ విషయాలు ఈజీగా నేర్చుకునేందుకు ‘ట్యూటర్​’ అనే యాప్ తెచ్చారు వీళ్లు. ఆగ్మెంట్ టెక్నాలజీతో పనిచేసే ఈ యాప్​ని  కేరళకు చెందిన ముగ్గురు ఇంజనీర్లు తయారుచేశారు.  స్టార్టప్​ యాప్​తో త్రీడి క్లాసులు అందిస్తున్న వీళ్ల ఇన్నొవేషన్ గురించి...

సెయింట్ జోసెఫ్​ కాలేజీ ఇంజనీరింగ్, టెక్నాలజీకి చెందిన థామ్సన్​ టామ్, త్రిస్సూర్​ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన పాలా, శ్యామ్​ ప్రదీప్ అలీల్ ఈ యాప్​ని తయారుచేశారు. పాలా, శ్యామ్​కి ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీలో  పరిచయం. అక్కడ చదువుకునే టైంలో  ఆగ్మెంట్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ  మీద రీసెర్చ్ చేసేవాళ్లు.  మనదేశంలోని అన్ని ఇనిస్టిట్యూట్స్​, కాలేజీలకు ఈ కొత్తరకం టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని కలలు కనేవాళ్లు ఈ ఇద్దరు. వీళ్లకు థామ్సన్​ తోడయ్యాడు. 

కరోనా ఫస్ట్​వేవ్​లోనే

కరోనా వచ్చిన మొదట్లో స్కూళ్లు మూతపడడంతో పిల్లల చదువులు ఆగిపోయాయి. ఆ టైంలో ఆగ్మెంట్, వర్చువల్​ రియాలిటీ యాప్ ఉంటే పిల్లలు, టీచర్లకు చాలా ఉపయోగపడుతుంది అనుకున్నారు వీళ్లు. అయితే, వర్చువల్ రియాలిటీ ద్వారా క్లాసులు వినేందుకు హెడ్​సెట్స్​ కావాలి. అంతేకాదు టీచర్లు, స్టూడెంట్లకు ఆ టెక్నాలజీని వాడడంలో ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకని  ఆగ్మెంట్ టెక్నాలజీ సాయంతో క్లాస్​రూమ్​ని డిజిటల్ క్లాస్​రూమ్​గా మార్చాలని అనుకున్నారు ఈ ముగ్గురు.  అందుకోసం ‘ట్యూటర్​’ అనే యాప్​ తయారుచేశారు. ఈ యాప్​ని స్మార్ట్​ఫోన్​లో, విండోస్, మ్యాక్​లో డౌన్​లోడ్ చేసుకుని, పాఠాలు వినొచ్చు. ఈ యాప్​ ఇంటర్నెట్​ లేకపోయినా కూడా పనిచేస్తుంది.  

ఎలా పనిచేస్తుందంటే...

‘ట్యూటర్​’ యాప్​లో ​ ఆగ్మెంట్ టెక్నాలజీ సాయంతో త్రీడి మోడల్స్​ని చూడొచ్చు. ఉదాహరణకు మనిషి గుండె, కండ్ల గురించి  చెప్పడానికి...  త్రీడి గుండె, త్రీడి కండ్లను చూపిస్తూ, క్లాస్​లు చెప్తారు టీచర్లు. దాంతో పిల్లలు తొందరగా వాటి గురించి అర్థం చేసుకుంటారు. ఇలా క్లాస్​లు చెప్తే వాళ్లకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్  పెరుగుతుంది. స్కూల్ కరిక్యులమ్​లోని ముఖ్యమైన పాఠాల్ని త్రీడి బొమ్మలుగా చేస్తారు. అందుకోసం త్రీడీ మోడల్ డెవలపర్స్​తో పాటు సబ్జెక్ట్ ఎక్స్​పర్ట్స్​ ఉంటారు. వీళ్లు టీచర్లు, స్టూడెంట్ల నుంచి ఫీడ్​బ్యాక్ తీసుకుని ప్రతి నెలా యాప్​ని  అప్​డేట్ చేస్తారు. 

అదే మా ఉద్దేశం

“మా యాప్​ని సబ్​స్క్రయిబ్ చేసుకోవచ్చు. ఏడాదికి సబ్​స్క్రిప్షన్​ ధర  దాదాపు యాభై వేలు. అయితే, సబ్జెక్ట్, యాప్​ని డౌన్​లోడ్​ చేసుకునే టీచర్ల సంఖ్యని బట్టి ఈ ధర మారుతుంది. ట్యుటర్​ యాప్​ని ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 150కి పైగా స్కూళ్లలో వాడుతున్నారు. టెక్నాలజీ సాయంతో ఏ విషయం అయినా తొందరగా, ఈజీగా నేర్చుకునేలా చేయడమే మా ఉద్దేశం’’ అంటున్నాడు ఈ యాప్ తయారుచేసిన ముగ్గురిలో ఒకడైన శ్యామ్ ప్రదీప్ అలీల్.