ఆ 8 మంది కోసం హెలికాప్టర్లతో వెతుకులాట

ఆ 8 మంది కోసం హెలికాప్టర్లతో వెతుకులాట
  • నందాదేవి పర్వతం ఎక్కుతూ మిస్సింగ్
  • వారిలో ఏడుగురు విదేశీయులు
  • మరో నలుగురు బ్రిటన్ క్లైంబర్లను కాపాడిన అధికారులు

ఉత్తరాఖండ్​లోని నందాదేవి పర్వతాన్ని ఎక్కుతూ కనిపించకుండా పోయిన 8 మంది పర్వతారోహకుల కోసం వెతుకులాట ముమ్మరంగా సాగుతోంది. ఆదివారం ఇండియన్ ఎయిర్​ఫోర్స్​కు చెందిన హెలికాప్టర్ల ద్వారా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. మిస్సింగ్ క్లైంబర్లలో నలుగురు బ్రిటన్​కు చెందిన వారు, ఇద్దరు అమెరికన్లు, ఒక ఆస్ర్టేలియన్, ఇండియన్ గైడ్ చేతన్ పాండే ఉన్నారు.

భారీ హిమపాతం?!

ఎనిమిది మందితో కూడిన బృందం మే 13న నందాదేవి పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించింది. ఈ పర్వతారోహకుల బృందానికి బ్రిటిష్ మౌంటెయిన్ గైడ్ మార్టిన్ మోరాన్ నేతృత్వం వహించాడు. వారు శుక్రవారమే బేస్​క్యాంప్​కు చేరుకోవాల్సి ఉంది. కానీ తిరిగి రాలేదు. పర్వతం పై నుంచి భారీ హిమపాతం జరిగినట్లు సంకేతాలు వచ్చాయని అధికారులు చెప్పారు. దీంతో మిస్ అయిన బృందాన్ని కనిపెట్టేందుకు శనివారం ఎమర్జెన్సీ వర్కర్లను పంపారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో సాయంత్రం సెర్చ్ ఆపరేషన్ ఆపేశారు. ఆదివారం ఉదయాన్నే మళ్లీ ప్రారంభించారు. రెండు హెలికాప్టర్లతో ఏరియల్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. మిస్సింగ్ క్లైంబర్ల గురించి ఇండియన్ అథారిటీలతో చర్చలు జరుపుతున్నామని బ్రిటిష్ ఫారిన్, కామన్​వెల్త్ ఆపీస్ (ఎఫ్​సీవో) తెలిపింది.

నలుగురు బ్రిటన్ క్లైంబర్ల రెస్క్యూ

నందాదేవి తూర్పు శిఖరం బేస్ క్యాంప్ వద్ద చిక్కుకున్న నలుగురు బ్రిటన్ పర్వతారోహకులను అధికారులు కాపాడారు. ‘‘బేస్​క్యాంప్​కు 21 కిలోమీటర్ల దూరంలో బ్రిటన్ క్లైంబర్లు చిక్కుకున్నారు. వారిని కాపాడాం”అని పితోరగఢ్​జిల్లా మేజిస్ర్టేట్ వీకే జోగ్​దండే చెప్పారు. మోరాన్​టీమ్​ను మే 24న తాము కలిశామని ఈ నలుగురు క్లైంబర్లు చెప్పినట్లు అధికారులు వివరించారు.

టఫెస్ట్ మౌంటెయిన్

ప్రపంచంలోనే 23వ ఎత్తయిన పర్వతం నందాదేవి. దేశంలో రెండో అతిపెద్దది. హిమాలయాల్లో ఉంటుంది. ఎత్తు 7,816 మీటర్లు. 1936లో దీని ఎత్తును తొలిసారి కొలిచారు. హిమాలయ పర్వతాల్లో అత్యంత క్లిష్టమైన వాటిలో ఒకటి.