పర్సనాలిటీ డిజార్డర్​తో పరేషాన్​

పర్సనాలిటీ డిజార్డర్​తో పరేషాన్​

ఫ్రెండ్స్, కొలిగ్స్, ఫ్యామిలీ.. రిలేషన్​షిప్​ ఏదైనా మొదట్లో అంతా బాగానే అనిపిస్తుంది.  ఒకరినొకరు అర్థం చేసుకున్నంతవరకు, గౌరవించుకున్నంతవరకు ఏ సమస్యా ఉండదు. ఎప్పుడైతే ఒకరు అవతలివాళ్లని కంట్రోల్ చేయడం మొదలుపెడతారో.. రిలేషన్​షిప్​లో ప్రాబ్లమ్స్​ వస్తాయి.  అందుకు కారణం... మానిప్యులేషన్​ అనే పర్సనాలిటీ డిజార్డర్. ఈ సమస్య ఉన్నవాళ్లలో కొందరు తామే గొప్ప అన్నట్టు ప్రవర్తిస్తారు. అవతలివాళ్ల ప్రేమ, అనురాగం తమకు మాత్రమే సొంతం అన్నట్టుగా ఉంటుంది మరికొందరి తీరు. అనుబంధాల్ని దెబ్బతీసే ఈసమస్య  గురించి సైకియాట్రిస్ట్​లు ఏం అంటున్నారంటే..

రిలేషన్​షిప్​ ఏదైనా కావొచ్చు... అందులో ఇద్దరికీ  ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. ఇద్దరికీ సమాన హక్కు ఉండాలి. ఇద్దరికీ ప్రైవసీ ఉండాలి. ఒకరి అభిప్రాయానికి ఒకరు విలువ ఇవ్వాలి.  కానీ, పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవాళ్లు అవతలివాళ్లని కంట్రోల్ చేస్తూ, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటివాళ్లు పార్ట్​నర్​కు ‘నేను ఇది చేయాలి అనుకుంటున్నా. నాకు ఇది నచ్చదు’ అని చెప్పేందుకు అవకాశం కూడా ఇవ్వరు.  చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేస్తారు. ఏ పొరపాటు జరిగినా ‘నీవల్లనే అలా జరిగింది. నీ వల్లే ఈ తలనొప్పులు’ అంటూ పార్ట్​నర్​ని తప్పుపడతారు. పాత విషయాల్ని  పదే పదే గుర్తుచేస్తూ ‘నువ్వు అప్పుడు అలా చేశావు. నువ్వు అలాంటి వ్యక్తివి’ అంటూ దెప్పిపొడుస్తుంటారు. అందరి ముందు అవతలివాళ్లని అవమానిస్తుంటారు.  

ఇవి రెండు రకాలు
పర్సనాలిటీ డిజార్డర్​లో బార్డర్​లైన్ పర్సనాలిటీ, నార్సిస్టిక్ పర్సనాలిటీ అని రెండు రకాలు ఉంటాయి. బార్డర్​లైన్ పర్సనాలిటీ ఉన్నవాళ్లు చాలా ఇన్​సెక్యూర్. వీళ్లకు పొసెసివ్​నెస్ ఎక్కువ. ‘నాకు తప్ప అందరికీ ఇంపార్టెన్స్​ ఇస్తున్నావు. నన్ను ఇదివరకులా  ప్రేమించడం లేదు. నాకు గిఫ్ట్ ఇవ్వలేదు. నువ్వు నన్ను వదిలేసి పోతావేమో. నాతోనే ఉండు’ అని పార్ట్​నర్​తో అంటుంటారు. ఇలాంటివాళ్లకు మళ్లీ మళ్లీ కమిట్​మెంట్స్​ ఇస్తూ ఉండాలి. అంతేకాదు, మాటిమాటికి భయపెడుతుంటారు. ‘నువ్వు అలా చేయకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా’ అని బెదిరిస్తారు కూడా. నార్సిస్టిక్ పర్సనాలిటీ.. ఈ డిజార్డర్ ఉన్నవాళ్లు ‘నేనే గొప్ప’ అనుకుంటారు. ‘నేను పెండ్లి చేసుకోవడం నీ అదృష్టం.  నా వల్లనే నీకు ఇంత మర్యాద’ అంటూ భార్య లేదా భర్తని చిన్నచూపు చూస్తుంటారు. అన్నింటిలోనూ తమదే పై చేయి అన్నట్టుగా ఉంటుంది వీళ్ల ప్రవర్తన. అవతలి వాళ్లకు గౌరవం ఇవ్వరు.  కనీసం వాళ్లు చెప్పేది కూడా వినరు. 

సైకలాజికల్ ప్రాబ్లమ్స్
మానిప్యులేషన్ వల్ల అవతలివాళ్లు మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. తమ ఫీలింగ్స్​ని మనసులోనే దాచుకుంటారు. దాంతో, వాళ్ల మీద వాళ్లకు కాన్ఫిడెన్స్ ఉండదు.‘ఏంటి నా జీవితం, నేను నిజంగా తప్పు చేస్తున్నానేమో? పార్ట్​నర్​ని హ్యాపీగా ఉంచడం లేదు. నా వల్లనే అన్ని సమస్యలు’ అని లోలోపల కుమిలిపోతుంటారు. అంతేకాదు అవతలివాళ్లకు నచ్చినట్టుగా ఉండేందుకు ప్రయత్ని స్తుంటారు. ‘ఈ పని చేస్తే ఏం అంటారో? ఈ వంటకం నచ్చుతుందో? లేదో?, ఇలా చేస్తే మెచ్చు కుంటారా? అని ఎప్పుడూ టెన్షన్​ పడుతుంటారు. దాంతో ఒంటరితనానికి లోనైతారు. కొన్నాళ్లకు డిప్రెషన్​లోకి వెళ్తారు.  ‘ఎవర్ని నమ్మాలి? ఎవర్ని నమ్మొద్దు? అనే కన్ఫ్యూజన్​ ఉంటుంది. అంతేకాదు  ఫ్రెండ్స్​, కొలిగ్స్​ మానిప్యులేట్ చేస్తున్నా కూడా గుర్తించలేకపోతారు. 

ఎందుకిలా చేస్తారంటే...
ఎవరికైనా పర్సనాలిటీ డిజార్డర్ ఉండడానికి... వాళ్లు పెరిగిన వాతావరణమే ప్రధాన కారణం. చిన్నప్పటి జ్జాపకాలు, అనుభవాలు,  సెక్సువల్ అబ్యూజ్, బుల్లీయింగ్, తల్లిదండ్రులు పదే పదే కొట్టడం, తిట్టడంతో పాటు  కొన్నిరకాల భయాలు  కొందరిలో పర్సనాలిటీ డిజార్డర్​కు కారణమవుతాయి.

బయటపడేందుకు...
‘నా ఒపీనియన్స్​, ఫీలింగ్స్​కు విలువ ఇస్తున్నారా? లేదా? ఏ విషయంలోనైనా ఇద్దరికి నచ్చినట్టే చేస్తున్నామా?’  అనేది గమనించాలి. ఎప్పుడూ ఎదుటివాళ్లు చెప్పేది వింటుంటే సొంతంగా ఆలోచించలేరు. మానిప్యులేషన్​ నుంచి తప్పించుకునేందుకు.. ‘నాకు ఇష్టమైన పని చేస్తాను. ఫలానా పని నాకు నచ్చదు. కాబట్టి ఆ పని చేయను’ అని చెప్పేయాలి. ప్రతి దానికి తప్పుపడుతుంటే ‘అందులో నా తప్పు ఏముంది? చూపించండి’ అని నిలదీయాలి. దాంతో, అవతలివాళ్లు ఆలోచనల్లో పడతారు. అప్పుడు మళ్లీ ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం, ప్రేమ ఏర్పడేందుకు అవకాశం ఉంది.  

థెరపీతో మార్పు తేవొచ్చు
మానిప్యులేషన్​కి గురైన వాళ్లకు ‘సిచ్యుయేషన్స్ ఎప్పుడు ఇలానే ఉంటాయి. నేను దేనికి పనికిరాను. చనిపోవాలని ఉంది’ వంటి ఆలోచనలు వస్తాయి. ఇలాంటివాళ్లు వెంటనే సైకియాట్రిస్ట్​ని కలవాలి.   పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవాళ్లు వాళ్లంతట వాళ్లు మారరు. ‘మేం ఎందుకిలా ప్రవర్తి స్తున్నాం?’ అనేది  అర్థమైనప్పుడే వాళ్లలో మార్పు వస్తుంది.  అందుకోసం థెరపీ ట్రీట్​మెంట్ చేయాలి. 

పేరెంట్స్ ఏం చేయాలంటే
చిన్నప్పుడు తల్లిదండ్రులతో అటాచ్​మెంట్​ ఎలా ఉంది? అనే దాని మీద పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అందుకని పిల్లల్ని చీటికిమాటికి తిట్టడం, కొట్టడం చేయొద్దు. ‘నువ్వు వందకు వంద మార్కులు తెచ్చుకుంటే సైకిల్ కొనిస్తాం, క్లాస్​ ఫస్ట్ వస్తే నీకు ఇష్టమైన బొమ్మలు కొనిస్తా’ అని ప్రామిస్​ చేస్తారు కొందరు పేరెంట్స్. ‘నువ్వు అలా ఉంటేనే మాకు ఇష్టం. నువ్వు ఆ పని చేస్తే మేం చాలా సంతోషిస్తాం’ అని  పిల్లలకి చెప్తుంటారు కొందరు తల్లిదండ్రులు. దాంతో, ‘మేము ఇలా చేస్తేనే మావాళ్లకు నచ్చుతాం’ అనే ఫీలింగ్ వస్తుంది వాళ్లకు. పెద్దయ్యాక  కూడా తమ పార్ట్​నర్​ గిఫ్ట్​ ఇస్తేనే తమని ఇష్టపడుతున్నారని అనుకుంటారు. అంతేకాదు ​మార్కుల్ని చూసి పిల్లల టాలెంట్​ని అంచనా వేయొద్దు. అలాకాకుండా వాళ్లకు లైఫ్​ స్కిల్స్ నేర్పాలి. నలుగురిలో ఎలా ఉండాలి? అవతలివాళ్లను ఎలా గౌరవించాలి? అనేవి నేర్పిస్తే, పిల్లలు  పర్సనాలిటీ డిజార్డర్ బారిన పడే అవకాశం తక్కువ. ఫ్రెండ్స్​, కొలిగ్స్​ ఎవరికైనా పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్లు గమనిస్తే, వాళ్లు ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడేందుకు సాయం చేయాలి.

డాక్టర్ అస్ఫియా కుల్సుమ్​ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్,

సైకోఅనలిటిక్ ఫిజియోథెరపిస్ట్, రెనోవా హాస్పిటల్స్,  హైదరాబాద్.