భారీ వర్షాలకు కుప్పకూలిన నాలుగంతస్తుల బిల్డింగ్

భారీ వర్షాలకు కుప్పకూలిన నాలుగంతస్తుల బిల్డింగ్

తమిళనాడును భారీ వర్షాలు ఇంకా వదలడం లేదు. ఈ నెల మొదటి నుంచి వాయుగుండాలు, తుఫాన్లతో ఆ రాష్ట్రాన్ని ముసురు కమ్మేసింది. మధ్యలో ఒకటి రెండ్రోజులు గ్యాప్ ఇచ్చినా మళ్లీ వాన కురుస్తూనే ఉంది. మంగళవారం ఉదయం సేలం జిల్లాలోని కరుంగళ్ పట్టిలో భారీ వర్షాలకు నానిపోయి.. నాలుగంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది. దీంతో ఆ భవనం శిథిలాల కింద 17 మంది చిక్కుకుపోయారు. ఈ ఘటన గురించి సమాచారం అందడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 13 మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురిని రక్షించేందుకు సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.  శిథిలాలను తొలగించి, వాటి కింద చిక్కుకున్న వాళ్లను కాపాడుతామని రెస్క్యూ టీమ్ తెలిపింది. 


61 శాతం ఎక్కువ వర్షపాతం

ఈశాన్య రుతపవన కాలంలో తమిళనాడు ఇప్పటికే 61 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. సాధారణ వర్ష పాతానికి మించి ఈ స్థాయిలో వానలు కురవడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరద ముంపు బారినపడ్డాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పుదుచ్చేరిలోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. మరోవైపు రానున్న 24 గంటల పాటు కూడా తమిళనాడులోని తిరునల్వేళి, తూత్తుకూడి, మదురై, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తమిళనాడులోని మిగిలిన జిల్లాలు, పుదుచ్చేరి, కరైకాల్ లలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.