కరోనా వల్ల ఇప్పటికి 40 లక్షల మంది బలి

కరోనా వల్ల ఇప్పటికి 40 లక్షల మంది బలి

కరోనా కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మందికిపైగా ప్రజలు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఒకవైపు సంపన్న దేశాలు ఆంక్షలను సడలిస్తుంటే.. మరోవైపు ఆసియా దేశాలు పెరుగుతున్న ఇన్ఫెక్షన్లతో పోరాడుతున్నాయని పేర్కొంది. ఆసియావ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్‌లు ప్రారంభమవుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇండోనేషియాలో కొవిడ్‌ మరణాల రేటు పదిరెట్లు పెరిగి.. కరోనాకు గ్లోబల్‌ హాట్‌స్పాట్‌గా నిలుస్తోందని డబ్ల్యూహెచ్‌వో వ్యాఖ్యానించింది. బుధవారం ఒక్కరోజే ఇండోనేషియాలో 1,040 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారిసంఖ్య 40 లక్షలు అనేది కేవలం అంచనా మాత్రమేనని.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనమ్‌ ఘెబ్రియేసస్ తెలిపారు. వైరస్‌ వెలుగులోకి వచ్చి 18 నెలలు గడిచినా ప్రపంచం ముందుకు సాగేందుకు ఇంకా కష్టపడుతోందన్నారు. టీకాలు, వైద్య పరికరాలను నిల్వ చేయడంపై ధనిక దేశాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.