ఓపెన్​ కేటగిరి నుంచి ఎస్టీలకు 4 రోస్టరు పాయింట్లు

ఓపెన్​ కేటగిరి నుంచి ఎస్టీలకు 4 రోస్టరు పాయింట్లు
  • ఓపెన్​ కేటగిరి నుంచి ఎస్టీలకు 4 రోస్టరు పాయింట్లు
  • 10 శాతానికి పెంచిన రిజర్వేషన్ల ప్రకారం సబార్డినేట్ సర్వీస్
  • రూల్స్ లో మార్పులు.. సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు

హైదరాబాద్​, వెలుగు : పెంచిన రిజర్వేషన్లకు అనుగుణంగా ఎస్టీలకు ఉద్యోగ నియామకాల్లో రోస్టర్​ పాయింట్లను ప్రభుత్వం ఖరారు చేసింది. 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచిన దానికి అనుగుణంగా కొత్తగా 4 రోస్టర్​ పాయింట్లను ఒపెన్​ కేటగిరి నుంచి ఎస్టీలకు కేటాయించింది.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్​ అండ్​ సబార్డినేట్ సర్వీస్​ రూల్స్‌ 1996లో మార్పులు చేసింది. రూల్​ 22కు సవరణ చేస్తూ  సీఎస్​ సోమేశ్​ కుమార్​ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఎస్టీలకు వర్తించనున్నాయి.

ప్రతి వందలో ఎస్టీలకు  8,15, 25, 33, 42, 58, 67, 75, 83, 92 రోస్టర్​ పాయింట్లు కేటాయించారు. అయితే సర్వీస్​ రూల్స్​లో 50 శాతం రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎస్​ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాగా ఆరు శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నప్పుడు  ప్రతి వందలో 8, 25, 33, 58, 75, 83 స్థానాలను ఎస్టీలకు రోస్టర్​ ఇచ్చారు.  అయితే పది శాతం రిజర్వేషన్ల ప్రకారం ఒపెన్​ కేటగిరి నుంచి 15, 42, 67, 92  ఉన్న రోస్టర్ పాయింట్లను ఇప్పుడు ఎస్టీలకు కేటాయించారు. అదే సమయంలో పాత రోస్టర్​ పాయింట్లలో  ఎస్టీ (జనరల్​) లకు కేటాయించిన 33, 75 రోస్టర్లను ఇప్పుడు ఎస్టీ మహిళలకు మార్చారు. ఎస్టీ వుమెన్​​ఉన్న 58వ రోస్టర్​ను  ఎస్టీ జనరల్ కు మార్చారు.

ప్రతి వందలో ఎస్టీల రిజర్వేషన్​కు కొత్త రోస్టర్ ఇదే​ 


8,15, 25, 33, 42, 58, 67, 75, 83, 92 (ఇం దులో 8, 33, 75 రోస్టర్​ పాయింట్లు ఎస్టీ వుమెన్​)