
- 4 టన్నుల రాకెట్.. జాబిలితో ఢీ
- 8,800 కిలోమీటర్ల వేగంతో చీకటి చంద్రుడివైపు కూలిపోనున్న రాకెట్
వాషింగ్టన్: చందమామను తొలిసారి అంతరిక్ష వ్యర్థాలు ఢీకొట్టబోతున్నాయి. జాబిలిని 4 టన్నుల రాకెట్ ఢీకొట్టనుంది. మనకు కనిపించని చీకటి చంద్రుడివైపున గంటకు 8,800 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి కూలిపోనుంది. ఫలితంగా చంద్రుడిపై భారీ గొయ్యి ఏర్పడుతుందని, పెద్ద మొత్తంలో చందమామ దుమ్ము, ధూళి, శకలాలు 20 నుంచి 30 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడతాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. నాసా లూనార్ ఆర్బిటర్ లేదా ఇండియా చంద్రయాన్2 ఆర్బిటర్ ఇంపాక్ట్‌కు సంబంధించిన ఫొటోలు తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
చైనాదా? స్పేస్ఎక్స్దా?
‘‘గతంలోనూ చందమామను చాలా వస్తువులు ఢీకొట్టాయి. కానీ, అవన్నీ చందమామపై ఇంపాక్ట్‌ను తెలుసుకునేందుకు కావాలని చేసిన ప్రయోగాలు. ల్యాండర్లను దించే క్రమంలో మరికొన్ని కూలిపోయాయి’’ అని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విష్ణు రెడ్డి చెప్పారు. ఆయన టీమే ఈ రాకెట్ శకలం చందమామను ఢీకొడుతుందని గుర్తించింది. వాస్తవానికి ఏడేండ్ల కిందట స్పేస్ఎక్స్ పంపించిన రాకెట్ శకలమే చందమామపై కూలిపోతుందని భావించినా.. 2014లో చంద్రుడిపై పరిశోధనల కోసం పంపిన చాంగీ 5 టీ1 రాకెట్ ఢీకొడుతుందని సైంటిస్టులు తేల్చారు. అయితే, చైనా మాత్రం ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చింది. ఆ రాకెట్ బూస్టర్ ఇప్పటికే భూ వాతావరణంలోకి ప్రవేశించి పూర్తిగా కాలిపోయిందని ప్రకటించింది.