
- ములుగు జిల్లా జంగాలపల్లిలో విషాదం
ములుగు, వెలుగు : జ్వరంతో నాలుగేండ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన ములుగు జిల్లా జంగాలపల్లిలో గురువారం జరిగింది. బాలుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చెలిమెల తిరుమల, సురేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు హిమ వర్షిత్(4) ములుగులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో నర్సరీ చదువుతున్నాడు. జేసీబీ డ్రైవర్‌గా పనిచేసే సురేశ్ రెండేండ్ల కింద అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి తల్లి తిరుమల కూలీ పనులు చేస్తూ ఇద్దరు కొడుకులను చూసుకుంటోంది.
హిమ వర్షిత్‌కు నాలుగు రోజుల కింద జ్వరం రావడంతో ములుగు ఏరియా హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. రెండు రోజుల ట్రీట్‌మెంట్ అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. బుధవారం మరోసారి జ్వరం రావడంతో తిరిగి ములుగు హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ గురువారం తెల్లవారుజామున బాలుడు చనిపోయాడు. అయితే చిన్నారికి తలసేమియా వ్యాధి ఉన్నందున ప్రతి మూడు నెలల ఒకసారి రక్త మార్పిడి చేయాలని, గురువారం రక్తమార్పిడి జరగాల్సి ఉండగా.. అంతలోనే జ్వరం రావడం, రక్తకణాలు తగ్గిపోవడంతో బాలుడు చనిపోయినట్లు తెలుస్తోంది. రెండేండ్ల కింద భర్త, ఇప్పుడు కుమారుడు చనిపోవడంతో బాలుడి తల్లి, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.