ఆకలి దంచేస్తోంది. వంట చేసుకునే ఓపిక లేదు. వెంటనే ఫోన్ తీసి ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టేసిందో అమ్మాయి. కాసేపట్లో ఆ ఆర్డర్ వచ్చేసింది. ఫ్రెండ్స్ తో కలిసి పార్సిల్ ఓపెన్ చేసింది. వేడివేడి బాతుమాంసం. చూస్తేనే నోరూరిపోతోంది వాళ్లకు. చాప్ స్టిక్స్ చేతిలో పట్టుకున్నారు. మాంసం ముక్కను అందుకున్నారు. కానీ, అది మాంసం ముక్క కాదు. చచ్చిన బొద్దింక. అమ్మో అనుకున్న ఆ ఫ్రెండ్స్ కు అనుమానం వచ్చింది. ఇంకా ఉండే ఉంటాయని మాంసం మొత్తం వెతికారు. ఒక్కొక్క బొద్దింకను బయటకు తీసి టిష్యూ పేపర్ పై పెట్టారు. అంతా అయ్యాక చూస్తే 40 చచ్చిన బొద్దింకలు లెక్క తేలాయి. ఓరి దేవుడా.. అనుకున్న ఆ ఫ్రెండ్స్ వెంటనే రెస్టారెంట్ కు ఫిర్యాదు చేశారు.
పనిలో పనిగా పోలీసులకూ చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి.. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఫుడ్డు అందించిన ఆ రెస్టారెంట్ కూడా దర్యాప్తు చేపట్టింది. 15 రోజుల పాటు రెస్టారెంట్ ను మూసేస్తున్నట్టు ప్రకటించింది. దక్షిణ చైనాలోని షాంతూ అనే పట్టణంలో జరిగిందీ ఘటన. తినే అన్నంలోనో, కూరలోనో చిన్న పురుగొస్తేనే యాక్ అని.. ఆ భోజనం మొత్తాన్ని పక్కకు పెట్టేస్తాం. అలాంటిది, 40 బొద్దింకలంటే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుం దో ఒక్కసారి ఊహించుకోండి!!
