వరదలో చిక్కుకున్న 40 మంది స్టూడెంట్లు సేఫ్

వరదలో చిక్కుకున్న  40 మంది స్టూడెంట్లు సేఫ్

మణుగూరు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అశోక్ నగర్​ఎస్సీ బాయ్స్​ హాస్టల్​ను బుధవారం సాయంత్రం వరద నీరు చుట్టు 
ముట్టింది. అందులోని 40 మంది డిగ్రీ స్టూడెంట్లు నీటిలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న మణుగూరు సీఐ ముత్యం రమేశ్ తాడు సహాయంతో అందరిని సేఫ్​గా బయటకు తీసుకువచ్చారు. స్థానిక కోడిపుంజుల వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో అశోక్ నగర్, కూనవరం, రైల్వే గేట్ ఏరియాలు నీట మునిగాయి. ముంపు బాధితులను పోలీసులు ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని పునరావాస కేంద్రానికి తరలించారు.

3 నెలల పసికందును కాపాడిన ఎస్సై

జ్యోతినగర్ : పెద్దపల్లి జిల్లా రామగుండంలో వరద నీరు చుట్టుముట్టిన ఇంట్లోకి వెళ్లి మూడు నెలల పాపను సేఫ్​గా బయటికి తీసుకొచ్చారు స్థానిక ఎస్సై. బుధవారం కురిసిన వర్షాలకు రామగుండం కార్పొరేషన్​ఎన్టీపీసీ ఏరియాలోని 2, 3, 5, 23డివిజన్లలోకి భారీగా వరద నీరు చేరింది. 23వ డివిజన్ లోని జెన్ కో బూడిద కరకట్ట తెగడంతో స్థానిక ఇండ్లను వరద చుట్టు ముట్టింది. చాలా ఇండ్లలోకి మోకాలు లోతు నీరు చేరింది. ఎన్టీపీసీ పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద చుట్టుముట్టిన ఇంట్లో ఇరుక్కుపోయిన 3 నెలల పసికందును స్థానిక ఎస్సై జీవన్ సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.