డిస్కంలకు సర్కారు ..బకాయిలు 40 వేల కోట్లు

డిస్కంలకు సర్కారు ..బకాయిలు 40 వేల కోట్లు
  • ఆస్తులను బ్యాంకులో కుదవ పెట్టి అప్పు చేసి కరెంట్ ​ఇస్తున్న విద్యుత్ ​సంస్థలు
  •     గత పదేండ్ల కాలంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన బకాయిల భారం
  •     2014 నాటికి రూ.1576 కోట్లు ఉంటే.. ప్రస్తుతం రూ.25 వేల కోట్లు
  •     సబ్సిడీ బాకీలు మరో రూ.15 వేల కోట్లు పెండింగ్

హైదరాబాద్‌‌, వెలుగు : విద్యుత్​పంపిణీ సంస్థ(డిస్కం)లకు వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. వివిధ అవసరాలకు, సంస్థలకు కరెంట్​వాడుకున్న సర్కారు.. వాటి బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించలేదు. లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్ట్‌‌లు, హైదరాబాద్‌‌ మెట్రో వాటర్‌‌ వర్క్స్‌‌, పంచాయతీరాజ్‌‌, మున్సిపాల్టీలు ఇలా ప్రభుత్వ సంస్థల బాకీలే వేల కోట్లు పెండింగ్ ఉండగా, పేద వర్గాలకు ఇచ్చే సబ్సిడీ డబ్బులు కూడా సర్కారు డిస్కంలకు కట్టలేదు. రాష్ట్రం వచ్చే నాటికి రూ. 1576 కోట్లు ఉన్న బకాయిలు.. గత పదేండ్ల కాలంలో రూ.40 వేల కోట్లకు చేరుకున్నాయి. 

ఉన్న ఆస్తులన్నీ బ్యాంకుల్లో కుదవ పెట్టిన విద్యుత్‌‌ సంస్థలు.. అతి కష్టం మీద కరెంట్​సరఫరా చేస్తున్నాయి. అప్పులు చేయనిదే ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.  రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, అనుబంధ సంస్థల నుంచి బిల్లుల రూపంలో విద్యుత్‌‌ సంస్థలకు రావాల్సిన బాకీలు 2014 జూన్​1వ తేదీ నాటికి రూ.1576 కోట్లు ఉండేవి.  కానీ రాష్ట్ర సర్కారు గత పదేండ్లలో బిల్లులు కట్టలేదు. దీంతో అవి 2023 నంబర్‌‌ 30 నాటికి రూ.25 వేల కోట్లకు చేరాయి. లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్ట్‌‌లకు రాష్ట్రం వచ్చే నాటికి రూ.135 కోట్ల బాకీ ఉంటే నేడు ఆ మొత్తం రూ.11 వేల కోట్లకు పెరిగిపోయింది. హైదరాబాద్‌‌ మెట్రోవాటర్‌‌ వర్క్స్‌‌ బాకీ రూ.362 కోట్లు ఉంటే నేడు రూ.3,650 కోట్లకు పెరిగిపోయింది.

సబ్సిడీల బాకీ పెద్ద మొత్తంలో

సబ్సిడీల రూపంలో సర్కారు సరఫరా చేస్తున్న కరెంటు బిల్లులకు సంబంధించిన డబ్బులు కూడా పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. రాష్ట్రంలోని 25.78 లక్షల అగ్రికల్చర్‌‌ కరెంట్​కనెక్షన్‌‌లకు ఉచిత విద్యుత్‌‌ అందుతోంది. ఈ పంపుసెట్‌‌లకు సరఫరా చేసే కరెంటుకు సర్కారు పూర్తిగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. కానీ సరఫరా చేసినదానికి సరిపడా చెల్లించకపోవడంతో ఏటా వేలకు వేలు పెండింగ్‌‌ పడింది. టారీఫ్‌‌ సబ్సిడీ రూపంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు101యూనిట్ల వరకు, నాయీబ్రాహ్మణుల సెలూన్‌‌లకు, దోబీవర్గాల లాండ్రీషాపులకు 250 యూనిట్ల వరకు సర్కారు ఉచితంగా కరెంటు అందించింది. 

వీటికి తోడుగా పవర్‌‌లూమ్‌‌లకు, స్పిన్నింగ్‌‌ మిల్స్‌‌కు, పౌల్ట్రీఫామ్‌‌లకు యూనిట్‌‌కు రూ.2 చొప్పున కరెంటు బిల్లులు రాయితీ అమలు చేసింది. ఇవన్నీ ఆయా వర్గాల బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు చెల్లించాల్సి ఉంది. కానీ ఈ సబ్సిడీలకి సంబంధించిన డబ్బులను సర్కారు విద్యుత్ సంస్థలకు చెల్లించలేదు. ఇలా ఈ పదేండ్లలో రూ.15 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. సర్కారు సంస్థలు చెల్లించాల్సిన బిల్లులు, సబ్సిడీ సంబంధించిన బల్లులు అన్ని కలిపితే రూ.40 వేల కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. వచ్చే ప్రభుత్వానికి ఈ మొత్తం బకాయిలు క్లియర్ ​చేయడం భారంగా మారే అవకాశం ఉంది.