భూపతిపూర్ లో పాత రాతియుగం పనిముట్ల కార్ఖానా

భూపతిపూర్ లో పాత రాతియుగం పనిముట్ల కార్ఖానా
  • గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం

ఏటూరునాగారం, వెలుగు: 40 వేల ఏండ్ల కింద ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం  భూపతిపూర్  గ్రామంలో పాత రాతియుగం పనిముట్లకు కార్ఖానా ఉండేదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు గుర్తించారు. కొండవీటి గోపీ వరప్రసాదరావు, మహమ్మద్  నసీరుద్దీన్, అహోబిలం కరుణాకర్  భూపతిపూర్  గ్రామంలో 12 పాత రాతియుగం నాటి పనిముట్లను గుర్తించారు. ఇవి 6 అంగుళాల నుంచి 3 అంగుళాల పొడవు కలిగి ఉన్నాయని వారు తెలిపారు. క్లీవర్లు, క్లీవర్  చేతి గొడ్డలి, స్క్రాపర్లు, చాపర్లు, ఫ్లేక్స్, చేతి గొడ్డళ్లు ఉన్నాయి.

 వీటి తయారీ శైలిని పరిశీలించినపుడు లక్ష నుంచి 40 వేల సంవత్సరాలకు పూర్వం చేసినవిగా తెలిసిందని చెప్పారు. వీటిలో ద్వికుంభాకార చేతిగొడ్డలి, ఏక ముఖ స్క్రాపర్లు, ద్విముఖ క్లీవర్లు ఉన్నాయి. భూపతిపూర్  గ్రామానికి పడమర దిక్కున అటవీ ప్రాంతంలో, దేవాదుల పైప్ లైన్  దగ్గరలో గోదావరి పాయ పారే వాగు సమీపంలో కార్ఖానే ఉండేదని తెలిపారు. పాత రాతియుగం పనిముట్లే కాదు, వందలాది మధ్య రాతియుగం, సూక్ష్మరాతి పనిముట్లు(మైక్రోలిథ్స్) కూడా కనిపించాయని పరిశోధన బృందం సభ్యులు తెలిపారు.