ట్రైబల్ యూనివర్సిటీలో..40.5% సీట్లు గిరిజనులకే

ట్రైబల్ యూనివర్సిటీలో..40.5% సీట్లు గిరిజనులకే
  • ఈ విద్యా సంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభం: కిషన్ రెడ్డి
  •     సమ్మక్క సారలమ్మ వర్సిటీ ఏర్పాటుకు 900 కోట్లు కేటాయించాం
  •     తాత్కాలిక క్యాంపస్​ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
  •     ములుగు.. ఎడ్యుకేషన్ హబ్​గా మారనుంది: మంత్రి సీతక్క

ములుగు/వరంగల్, వెలుగు : మహిళా దినోత్సవం రోజు సమ్మక్కసారలమ్మ పేరుతో ట్రైబల్ యూనివర్సిటీ క్లాసులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీలో 7.5 శాతం గిరిజన కోటాతో పాటు మరో 33 శాతం కలిపి మొత్తం 40.5 శాతం సీట్లు ట్రైబల్ స్టూడెంట్స్​తోనే భర్తీ చేస్తామని తెలిపారు. ములుగు మండలం జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో ట్రైబల్ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్​ను మంత్రి సీతక్క, ఎంపీ మాలోతు కవితతో కలిసి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. 

అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘గిరిజనుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ట్రైబల్ యూనివర్సిటీ కోసం రూ.900 కోట్లు కేటాయించారు. ఈ విద్యా సంవత్సరంలో బీఏ ఇంగ్లీష్, సోషల్ సైన్సెస్ కోర్సులు ప్రారంభిస్తున్నాం. ఇక్కడ గిరిజనుల భాష, సంస్కృతీ సంప్రదాయాలు, ఉపాధి అవకాశాలపై పరిశోధనలు జరగాలి. ఈ వర్సిటీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెంటార్​గా వ్యవహరిస్తున్నది. 

అసిస్టెంట్ ప్రొఫెసర్ వంశీ ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వర్సిటీకి కావాల్సిన 377 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది. మరో 50 ఎకరాలకు ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ నుంచి అనుమతులు రావాల్సి ఉన్నాయి. లోక్​సభ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ములుగులో పర్మినెంట్ బిల్డింగ్​ల నిర్మాణం కోసం భూమి పూజ చేసేందుకు కృషి చేస్తాం’’అని తెలిపారు. 

పురాతన కట్టడాలు కాపాడుకోవాలి: కిషన్ రెడ్డి

వరంగల్ వెయ్యి స్తంభాల గుడిలోని కల్యాణ మండపం పునర్నిర్మాణాన్ని చాలెంజింగ్​గా తీసుకుని రెండేండ్లలో పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వెయ్యి స్తంభాల కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించి రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ‘‘వెయ్యి స్తంభాల ఆలయంలో 132 పిల్లర్లతో ఉన్న మండపం ప్రమాదకరంగా మారడంతో 2006లో వాటిని విప్పేసి పక్కనపెట్టారు. 16 ఏండ్లలో 50% పనులే చేశారు. మోదీ సాయంతో రెండేండ్లలోనే మిగిలిన 50% పనులు పూర్తి చేశాం. పురాతన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది’’అని తెలిపారు. 

నోటిఫికేషన్ రాగానే దరఖాస్తు చేసుకోండి: సీతక్క

ములుగు ప్రాంతం ఇప్పటి దాకా కేవలం టూరిజం హబ్​గానే ఉందని, యూనివర్సిటీ ఏర్పాటుతో ఎడ్యుకేషన్ హబ్​గా మారుతుందని మంత్రి సీతక్క అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభంకానున్న నేపథ్యంలో గిరిజన యువతీయువకులు నోటిఫికేషన్ రాగానే ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలని సూచించారు. ట్రైబల్ యూనివర్సిటీకి సమక్క సారలమ్మ పేరు పెట్టడం సంతోషంగా ఉందని ఎంపీ మాలోతు కవిత అన్నారు. 

వర్సిటీ ఏర్పాటుతో స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అధికారులు ప్రొటోకాల్ పాటించలేదన్నారు. తన పేరు శిలాఫలకంపై లేదని అసహనం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో 80శాతం సీట్లు గిరిజనులతో భర్తీ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, ఎస్పీ శబరీశ్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా తదితరులు పాల్గొన్నారు.