18 కిలోమీటర్లకు రూ.4300 వసూలు చేసిన ఆటోవాలా

18 కిలోమీటర్లకు రూ.4300 వసూలు చేసిన ఆటోవాలా
  • పుణేకి కొత్తగా వెళ్లిన టెకీకి ఆటోవాలా బిల్లు

రమేశ్​.. అప్పుడే సిటీకి కొత్తగా వచ్చాడు. ఎక్కడ ఏం ఉంటుందో, ఏ బస్సెక్కాలో, ఎలా వెళ్లాలో తెలియదు. ఓ ఆటోవాలాకు అడ్రస్​ చెప్పి ఆటో ఎక్కాడు. కొత్త అని తెలుసుకున్న డ్రైవర్​ అతడి జేబును గుల్ల చేశాడు. ఇట్లాంటి అనుభవమే బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​కు పుణేలో ఎదురైంది. 18 కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 4,300 వసూలు చేశాడు ఆటో డ్రైవర్​.

బుధవారం జరిగిన ఈ ఘటనపై ఆ టెకీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెల్లవారు జామున రైలు దిగిన సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​ ఎరవాడ వెళ్లేందుకు క్యాబ్​ల కోసం చూశాడు. ఏవీ లేకపోవడంతో అటుగా పోతున్న ఆటోను పిలిచి మాట్లాడుకున్నాడు. ఒకతను డ్రైవ్​ చేస్తుండగా, అసలు డ్రైవర్​ అయిన వ్యక్తి వెనక కూర్చున్నాడు. ఆ ఆటోవాలా మీటర్​ సెట్​ చేశాడో లేదో చూసుకోకుండానే ఆ టెకీ ఆటో ఎక్కాడు. తీరా దిగాక అతడికి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చారు ఆ ఇద్దరు వ్యక్తులు. రూ. 4,300 కట్టాల్సిందిగా డిమాండ్​ చేశారు. టెకీ ఎదురు తిరిగితే, సిటీలో ఎంటరవడానికి ₹600, సిటీ నుంచి వెళ్లిపోవడానికి ఇంకో 600 తమ దగ్గరి నుంచి వసూలు చేశారని చెప్పి మొత్తం కట్టాల్సిందిగా బెదిరించారు.

అప్పటికీ ఇంకా చీకటిగానే ఉండడం, అక్కడ ఎవరూ లేకపోవడంతో భయపడిపోయిన ఆ సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​ వాళ్లు అడిగినన్ని డబ్బులు ఇచ్చాడు. అక్కడి నుంచి కంపెనీ ఇచ్చిన క్వార్టర్​కు వెళ్లాడు. తెల్లారి ఎరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగినదంతా వివరించాడు. ఆటో నంబర్​ను పోలీసులకిచ్చాడు. ఆ టైంలో అసలైన డ్రైవర్​ తాగి ఉన్నాడని, పోలీసులు పట్టుకోకుండా ఉండేందుకు తన ఫ్రెండ్​ ఆటో నడుపుతాడంటూ ఆ డ్రైవర్​ చెప్పాడని బాధిత టెకీ వివరించాడు.