ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి 44 వేల మంది కశ్మీరీ యువత

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి 44 వేల మంది కశ్మీరీ యువత

కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా కశ్మీర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీకి అక్కడి యువత బాగా స్పందిస్తోంది.  సాంబాలోని షేర్ బచా స్టేడియంలో నవంబర్ 3 నుంచి నవంబర్ 12 వరకు నిర్వహించే ఈ ర్యాలీకి యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే నవంబర్ 4, సోమవారం ఒక్కరోజే దాదాపు 44 వేల మంది యువత ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం.

జమ్మూ డిఫెన్స్ పీఆర్ఓ మాట్లాడుతూ.. ఇంత ఎక్కువ సంఖ్యలో యువత ర్యాలీలో పాల్గొనడం చూస్తుంటే వారు దేశానికి సేవ చేయాలని ఎంతగా తపిస్తున్నారో అర్ధమవుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా, యువకులంతా ఎంతో ఉత్సాహంతో మరియు శ్రద్ధతో ఈ ర్యాలీలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. యువత దేశానికి సేవ చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చెప్పడానికి ఈ ర్యాలీనే నిదర్శనమని, అంతేకాకుండా యువత చెడు మార్గంలో కాకుండా సరైన దారిలోనే నడుస్తున్నారని దీని ద్వారా తెలుస్తోందని ఆయన అన్నారు. ఈ ర్యాలీని చూస్తుంటే జమ్మూ కశ్మీర్ పురోగతిలో ఎటువంటి అడ్డంకులు రాబోవని ఆయన అన్నారు.

ఈ ర్యాలీతో జమ్మూ, కథువా, మరియు సాంబా జిల్లాల్లోని చాలా మంది యువత ఆర్మీ యూనిఫార్మ్ వేసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారని అర్ధమవుతుంది. ఈ ర్యాలీలో పాల్గొన్న ఓ యువకుడు మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని కోరుకున్నానని తెలిపాడు.  దాదాపు సంవత్సరన్నర తర్వాత నిర్వహిస్తున్న ఈ ర్యాలీ ఉద్యోగ అవకాశాలను పెంచడంతో పాటూ, దేశాన్ని రక్షించుకోవడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తోందని మరో యువకుడు అన్నాడు. ఇటువంటి ర్యాలీలతో ఉగ్రవాదానికి అనుకూలంగా ఉన్న పాకిస్తాన్‌కు తగిన సమాధానం చెప్పవచ్చని ర్యాలీలో పాల్గొన్న మరికొంత మంది యువత అభిప్రాయపడ్డారు.