
దేశ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు కేంద్రం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 46 టన్నులకు పైగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ ,అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
జులై 1 నుంచి నిషేదం
వేస్టేజ్‌కి ఎక్కువ అవకాశం ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తిపై కేంద్రం జులై 1 నుంచి నిషేధం విధించింది. ఆ ప్లాస్టిక్ వస్తువులను ఉత్పత్తి చేయడం, దిగుమతి చేసుకోవడం, నిల్వ చేసుకోవడం, సరఫరా చేయడం, అమ్మడం, వినియోగించడంపై నిషేధం విధించింది. మొత్తంగా 19 రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులను కేంద్రం గుర్తించింది. పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ వాతావరణమార్పు నిబంధనల అమల్లో భాగంగా ఈ నిషేధం విధించింది. ముఖ్యంగా సముద్ర జీవులపై, జీవ సంబంధ వ్యవస్థలపై ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రభావం తీవ్రంగా ఉందని గుర్తించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిషేధాన్ని విధించింది.
కీలక ఆదేశాలు..
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు, కాలుష్య నియంత్రణ కమిటీలు, ఇతర వాటాదారులకు సమగ్ర ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ యూజ్ ప్రొడ్యూసర్లు, ఈ కామర్స్ కంపెనీలకు ముడిసరుకు సరఫరాను నిలిపివేయాలని తయారీదారులకు ఆదేశాలు ఇచ్చింది.
కీలక చర్యలు..
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిర్మూలించేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. నిషేధ అమలను పర్యవేక్షించడం కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కంప్లయిన్స్ మానిటరింగ్ పోర్టల్ తో పాటు SUP పబ్లిక్ గ్రీవెన్స్ యాప్ ను అభివృద్ధి చేసింది. ఎక్కడికక్కడ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించింది. అంతేకాదు..ప్రత్యేకంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ పై అక్టోబర్ 17న ప్రత్యేక డ్రైవ్ ను ఏర్పాటు చేసింది. పూల విక్రేతలు, వీధి వ్యాపారులు, చేపల మార్కెట్లు, హోల్ సేల్ మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. దాదాపు 50 కంటే ఎక్కువ బృందాలు తనిఖీలు నిర్వహించి...జరిమానాలు విధించారు. దేశ వ్యాప్తంగా 20 వేల 36 సార్లు తనిఖీలు నిర్వహించగా...4వేల కేసులను నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన 2900 మందికి చలాన్లు జారీ చేయబడ్డాయి. దాదాపు రూ. 41 లక్షల ఫైన్లు అధికారులు వసూలు చేశారు.