ఉమ్మడి నిజామా బాద్‌‌ జిల్లాలో 480 ఎకరాలు కబ్జా

ఉమ్మడి నిజామా బాద్‌‌ జిల్లాలో 480 ఎకరాలు కబ్జా
  • ​​​​​అక్రమార్కులపై కానరాని చర్యలు

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామా బాద్‌‌ జిల్లా పరిధిలోని దేవాలయాల భూములకు రక్షణ లేకుండా పోయింది. రూ.కోట్ల విలువైన భూములను అక్రమార్కులు కబ్జాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 800 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అన్యాక్రాంతంతో సంబంధం ఉన్న అధికారులు, అక్రమార్కులపై చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

1,322  దేవాలయాలు.. 3,200 ఎకరాలు..

ఉమ్మడి నిజామాబాద్‌‌ జిల్లాలో 1,322  దేవాలయాలు ఉన్నాయి. నిజామాబాద్‌‌ జిల్లాలో 215 ఆలయాల పరిధిలో 1,400 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 250 దేవాలయాల పరిధిలో 1,800 ఎకరాల భూములు ఉన్నాయి. మిగతా దేవాలయాలకు భూములు లేకున్నా నామమాత్రపు ఆస్తులు ఉన్నాయి. ఈ దేవాలయాల పరిధిలోని భూములను కొన్నేళ్లుగా ఆయా గ్రామాల్లోని  రైతులే సాగు చేస్తున్నారు. నిజామాబాద్‌‌, కామారెడ్డి జిల్లాలతో పాటు ఇతర మున్సిపాలిటీల పరిధిలోని దేవాలయాల భూములను కూడా సాగు చేసుకుంటున్నారు. ఆఫీసర్లు కొన్ని దశాబ్దాలుగా ఈ భూములను పట్టించుకోకపోవడంతో అధిక శాతం అన్యాక్రాంతం అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని భూముల్లో ఇండ్లు కూడా నిర్మాణం చేసుకున్నారు. 

ఆక్రమణలు 480 ఎకరాలేనా..?

దేవాలయాల భూములపై అందుబాటులోని వివరాల ఆధారంగా ఇటీవల దేవాదాయ శాఖ అధికారులు సర్వే చేపట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 2,100 ఎకరాలకు పట్టా పాస్ బుక్స్‌‌ లేవని తేలింది. నిజామాబాద్ జిల్లాలో 300 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 180 ఎకరాలు కబ్జాలకు గురైనట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇప్పటికే కొన్ని భూముల కేసులు దేవాలయ ట్రిబ్యునల్‌‌తో పాటు ఇతర కోర్టుల్లోనూ ఉన్నాయి. 

ప్రభుత్వం పట్టించుకుంట లేదు

ఉమ్మడి జిల్లాలో  800 ఎకరాల ఆలయాల భూములు కబ్జా గురయ్యాయి. దీనిపై ఫిర్యాదులు చేసినా అటు ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. పహణీల ఆధారంగా సర్వే చేపట్టి భూములను కాపాడాలి. 

- రాజేంద్ర ప్రసాద్, ధర్మ జాగరణ కమిటీ జిల్లా మెంబర్

భూములు స్వాధీనం చేసుకున్నం

దేవాలయాల భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాం. ఉమ్మడి జిల్లాలో కబ్జాలకు గురైన 480 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాం. అలాగే 2,100 ఎకరాల దేవాలయాల భూములకు పట్టా పాస్ బుక్స్‌‌లు మంజూరు చేయాలని రెవ్యెన్యూ శాఖను కోరాం. 

- ఏ.సోమయ్య, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, నిజామాబాద్