
హైదరాబాద్, వెలుగు: రాబోయే 500 రోజుల్లో దేశంలోని మిగతా ప్రాంతాలన్నింటికీ 4జీ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ విధానంలో ఈ సేవలను తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అందిస్తున్నామని తెలంగాణ సర్కిల్ సీజీఎం కేవీఎన్ రావు చెప్పారు. తాము కూడా 5జీ సేవలను ప్రారంభిస్తామని, ఇందుకు సంబంధించి ఢిల్లీస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. పేటీఎంతో కలిసి నిర్వహించిన క్విజ్‌లో గెలుచుకున్న విజేతకు బుధవారం హైదరాబాద్‌లోని తమ ఆఫీసులో కారును అందజేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బీఎస్ఎన్ఎల్ రివైవల్ ప్యాకేజీ 2.0లో భాగంగా తెలంగాణ సర్కిల్ వ్యాప్తంగా 4,100 ‘4జీ’ మొబైల్ టవర్లను నిర్మిస్తాం.
రూ. 60 కోట్ల పెట్టుబడితో 1,363 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేస్తాం. రాష్ట్రంలోని 390 గ్రామాలకు 4జీ మొబైల్ సేవలను అందిస్తాం. మా సర్కిల్ 2021–-22 సంవత్సరంలో రూ.217 కోట్ల లాభంతో రూ.1,234 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. 2022–-23 సంవత్సరంలో సెప్టెంబర్ 2022 వరకు రూ.742 కోట్ల రెవెన్యూ, రూ.188 కోట్ల లాభం వచ్చాయి. మా ఆదాయంలో 45 శాతం మొత్తం హైదరాబాద్ నుంచే వస్తోంది. స్టార్టప్‌లు, విలేజ్ లెవెల్ ఎంటర్‌ప్రెన్యూర్లకు ఛానెల్ పార్ట్నర్లుగా అవకాశం ఇస్తున్నాం. తెలంగాణ సర్కిల్లో మాకు 30 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఏడాదిలోపు మేం దేశంలో మూడోస్థానంలోకి వస్తాం”అని ఆయన వివరించారు.