నాన్‌‌స్టాప్‌‌గా 13 వేల కిలోమీటర్లు ప్రయాణించిన పక్షి

నాన్‌‌స్టాప్‌‌గా 13 వేల కిలోమీటర్లు ప్రయాణించిన పక్షి

ఆగకుండా ఒకేసారి 13 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఓ పక్షి గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టింది. భూమిపై అత్యంత దూరం ప్రయాణించగల పక్షిగా రికార్డుల్లోకి ఎక్కిన ఆ పక్షి పేరు గాడ్విట్. సైబీరియన్ కొంగ, ఫ్లెమింగో లాంటి పక్షులు ప్రతి సంవత్సరం ప్రపంచంలోని ఒక మూల నుంచి మరో మూలకు వలస వెళ్తూ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి. అయితే అవేవీ ఒకేసారి పదివేల కిలోమీటర్లకు మించి ప్రయాణించలేవు. కానీ, ఐదు నెలల వయసున్న ఓ చిన్న గాడ్విట్ పక్షి నాన్‌‌స్టాప్‌‌గా 11 రోజుల పాటు గాలిలో ఎగురుతూ ఏకంగా 13,560 కిలోమీటర్లు ప్రయాణించింది. దాంతో ఇప్పటివరకూ వలస పక్షుల పేరుమీద ఉన్న రికార్డులన్నీ చెరిగిపోయాయి.

ఈ చిన్న గాడ్విట్ పక్షి అలస్కా నుంచి బయలుదేరి న్యూజిలాండ్ వరకూ ఆగకుండా వెళ్లింది. పక్షుల వలసలపై రీసెర్చ్ చేసే సైంటిస్టులు వాటికి ఐదు గ్రాముల బరువు ఉండే చిన్న ట్రాకర్స్‌‌ను అమర్చుతారు. వాటి సాయంతో అవి ఎంతదూరం ప్రయాణిస్తున్నాయో తెలుసుకుంటారు. అలాగే గాడ్విట్ ప్రయాణాన్ని ట్రాక్ చేసి తెలుసుకున్నారు.