
- మరింత పెరుగుతుందంటున్న ఎనలిస్టులు
ముంబై: మెటల్ స్టాక్స్, పవర్, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్‌లలో బలమైన ర్యాలీ తర్వాత, మంగళవారం ఇంట్రాడే డీల్స్‌లో బీఎస్ఈ- లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదటిసారిగా 5 ట్రిలియన్ల డాలర్లకు (దాదాపు రూ.41.65 కోట్ల కోట్లు) చేరుకుంది. బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంట్రాడే-లో తొలిసారిగా రికార్డు స్థాయిని దాటింది.
యూఎస్, చైనా, జపాన్, హాంకాంగ్ తర్వాత భారతదేశం ఐదవ అతిపెద్ద మార్కెట్ క్యాప్ దేశంగా అవతరించింది. భారతీయ ఈక్విటీలు మరింత దూసుకెళ్తాయని ఎనలిస్టులు చెబుతున్నారు. డిసెంబర్ 2024 చివరి నాటికి సెన్సెక్స్ 80,000 మార్క్‌ను తాకవచ్చని, నిఫ్టీ 50 ఇండెక్స్ 25,000 స్థాయిలకు చేరుకోవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గౌరంగ్ షా అంచనా వేస్తున్నారు. ఈసారి సాధారణ రుతుపవనాలు వస్తాయన్న అంచనాలు మార్కెట్‌కు మేలు చేస్తాయని చెప్పారు.
కొద్దిగా తగ్గిన మార్కెట్లు
విదేశీ మార్కెట్ల నుంచి బలహీనమైన పోకడలు, పెట్టుబడులు వెనక్కి మళ్లడంతో మంగళవారం సెన్సెక్స్ దాదాపు 53 పాయింట్లు క్షీణించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 27.05 పాయింట్లు పెరిగి 22,529.05 వద్ద ముగిసింది. నిఫ్టీలో 27 షేర్లు క్షీణించగా, 23 లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ షేర్లలో నెస్లే, మారుతీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, లార్సెన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి.