కరోనాపై పోరులో 5 ఆయుధాలను ఉపయోగిస్తున్నాం: కేజ్రీవాల్

కరోనాపై పోరులో 5 ఆయుధాలను ఉపయోగిస్తున్నాం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో వైరస్‌పై పోరులో ఐదు ఆయుధాలను ఉపయోగిస్తున్నామని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కోవడానికి, కేసులు తగ్గించడానికి ఆస్పత్రుల్లో బెడ్స్‌ సంఖ్యను పెంచడం, టెస్టింగ్ అండ్ ఐసోలేషన్, పల్స్ ఆక్సీమీటర్స్ అండ్ ఆక్సీజన్ కాన్‌సన్‌ట్రేటర్స్‌, ప్లాస్మా థెరపీ, సర్వేతోపాటు స్క్రీనింగ్‌ చాలా హెల్ప్ అయ్యాయని చెప్పారు. ‘లాక్‌డౌన్ ఎత్తేసినప్పుడు కరోనా కేసులు పెరుగుతాయని మేం అంచనా వేశాం. కానీ ఇంత భారీగా పెరుగుతాయని ఊహించలేదు. మాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి.. మళ్లీ లాక్‌డౌన్ విధించడం లేదా కరోనాతో ఫైట్ చేయడం. లాక్‌డౌన్ విధింపు సరికాదని చెప్పిన వాళ్ల సలహాలతోపాటు ప్రజల అభిప్రాయాన్ని కూడా మేం పరిగణనలోకి తీసుకున్నాం. మొదట్లో పేషెంట్లకు బెడ్స్ సరిపోయేవి కావు. దీంతో వైరస్ వల్ల చనిపోయే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అందుకే గత ఒక్క వారంలోనే బెడ్స్‌ సంఖ్యను చాలా ఎక్కువ స్థాయిలో పెంచాం. ఢిల్లీలో ఇప్పుడు 13,500 బెడ్స్ ఉన్నాయి. వాటిలో 6,500 బెడ్స్ పేషెంట్స్‌తో నిండిపోయి ఉన్నాయి. ఈ నెలారంభంలో రోజుకు 5 వేల టెస్టులు నిర్వహించాం. ఇప్పుడు ప్రతి రోజూ సుమారుగా 20 వేల టెస్టులు చేస్తున్నాం. మిగతా ఏ రాష్ట్రమూ ఇన్ని టెస్టులు చేయట్లేదు. మాకు యాంటీజెన్ కిట్స్‌ అందించడంతోపాటు కావాల్సిన సాయం చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.