కార్ల దొంగపై ఈడీ కేసు

కార్ల దొంగపై ఈడీ కేసు

పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా 5వేలకుపైగా కార్లను చోరీ చేసి అమ్మేసిన ఘరానా దొంగ అనిల్ చౌహాన్ అడ్డంగా దొరికిపోయాడు. గత 27 ఏళ్లుగా కార్ల దొంగతనాలకు పాల్పడుతూ.. దాదాపు 180 కేసులను ఎదుర్కొంటున్న అతడిని సెంట్రల్ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అనిల్ నుంచి ఆరు పిస్టల్స్, ఏడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రెండున్నర శతాబ్దాల పాటు కార్ల దొంగతనాలు చేసిన అనిల్.. ఇప్పుడు ఆయుధాల అక్రమతరలింపు దందాను స్టార్ట్ చేసినట్లు సమాచారం అందింది. ఇదే పని కోసం ఢిల్లీలోని దేశ్ బంధు గుప్తా రోడ్డు మీదుగా వెళ్తుండగా అనిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఉత్తరప్రదేశ్ నుంచి ఆయుధాలను అక్రమంగా తీసుకొచ్చి ఈశాన్య రాష్ట్రాలలోని నిషేధిత సంస్థలకు అమ్ముతున్నాడనే అభియోగాలను నమోదు చేశారు.

ఇదే తొలిసారేం కాదు..

అనిల్ చౌహాన్ అరెస్టు కావడం ఇదే తొలిసారేం కాదు. గతంలోనూ చాలాసార్లు అతడు అరెస్టయ్యాడు.. విడుదలయ్యాడు. 2015 సంవత్సరంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు అనిల్ ను అరెస్టు చేశారు. అప్పట్లో అతడు ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించి, 2020లో విడుదలయ్యాడు. బయటికొచ్చాక మళ్లీ కార్ల దొంగతనాల దందాను, ఆయుధాల స్మగ్లింగ్ ను మొదలుపెట్టాడు. ఈనేపథ్యంలో ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా అనిల్ పై మనీలాండరింగ్ కేసు నమోదు చేయడం గమనార్హం. 

మారుతీ800 కార్లే ఎక్కువ..

అది 1995 సంవత్సరం. అనిల్ చౌహాన్ అప్పుడొక ఆటో డ్రైవర్. ఢిల్లీలోని ఖాన్ పూర్ ఏరియాలో కుటుంబంతో నివసిస్తూ ఆటో నడుపుకునేవాడు. ఈజీ మనీ సంపాదించేందుకు కార్లను దొంగతనం చేయడం ప్రారంభించాడు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొంగిలించే కార్లను నేపాల్, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్మేసేవాడు. అతడు దొంగతనం చేసిన వాటిలో మారుతీ800 కార్లే ఎక్కువగా ఉన్నాయి. కార్లను దొంగిలించే క్రమంలో.. అడ్డొచ్చిన కొందరు ట్యాక్సీ డ్రైవర్లను అనిల్ హత్య చేశాడు.

స్థిర, చరాస్తులు కొన్నాడు..

ఇలా సంపాదించిన అక్రమ డబ్బుతో ఢిల్లీ, ముంబై, ఈశాన్య రాష్ట్రాల్లో స్థిర, చరాస్తులు కొన్నాడు. ప్రస్తుతం అతడు అస్సాంలో నివసిస్తూ ఆయుధాలు స్మగ్లింగ్ బిజినెస్ ను మొదలుపెట్టాడు. అస్సాంలోని  నిషేధిత సంస్థలకు ఆయుధాలను అక్రమంగా అందించే దందాను స్టార్ట్ చేశాడు. అనిల్ కు ముగ్గురు భార్యలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. దొంగతనాలతో సంపాదించిన డబ్బు అండతో అస్సాంలో కొందరు నాయకులను ప్రభావితం చేసి ప్రభుత్వ కాంట్రాక్టర్ గా గుర్తింపు సంపాదించడం గమనార్హం.