బస్ లో మరిచిన రూ.50 వేలు ప్రయాణికురాలికి అప్పగింత

బస్ లో మరిచిన రూ.50 వేలు ప్రయాణికురాలికి అప్పగింత

కోరుట్ల,వెలుగు: బస్​లో మర్చిపోయిన నగదును గుర్తించిన కండక్టర్ తిరిగి ప్రయాణికురాలికి అందించి పలువురి అభినందనలు అందుకున్నారు కండక్టర్ సరిత. వివరాలు.. గంభీర్ పూర్ కు చెందిన గొల్లమాడ వెంకటమ్మ అనే మహిళ పొలాసకు వెళ్లేందుకు ఆదివారం ఉదయం కోరుట్ల ఆర్టీసీ బస్ స్టాండ్ కు వచ్చి మంచిర్యాల రూట్ వెళ్లే బస్ ఎక్కి కండక్టర్ వెనక సీట్లో కూర్చుంది.

వెంకటమ్మకు ఫోన్ రావడంతో అక్కడే బ్యాగ్ ఉంచి మరో బస్ ఎక్కేందుకు వెళ్లింది. మళ్లీ గుర్తుకు వచ్చి బస్టాండ్ లో కంట్రోలర్ కిషన్ రావుకు విషయం చెప్పగా వెంటనే సదరు కండక్టర్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అప్పటికే కోరుట్ల పట్టణ శివారు సాయిబాబా ఆలయం వరకు వచ్చిన బస్ ను అక్కడే నిలిపి కండక్టర్ సరిత ఆమె బ్యాగులో ఉన్న ఆధార్ కార్డ్ ఆధారంగా రూ.50 వేల నగదును ప్రయాణికురాలు వెంకటమ్మకు అందజేసి నిజాయితీ చాటింది. ప్రయాణికురాలు మరిచిపోయిన సొమ్మును అప్పగించిన కండక్టర్ ను, డ్యూటీ కంట్రోలర్ కిషన్​రావును డిపో మేనేజర్ కృష్ణమోహన్, ఎస్ టీఐ జీపీ సింగ్, ప్రయాణికులు అభినందించారు.