కరోనా టెస్టులకు 52 ల్యాబ్​లు

కరోనా టెస్టులకు 52 ల్యాబ్​లు
  •                 ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
  •                 అధికారులతో ప్రధాని మోడీ సమీక్ష
  •                 దేశంలో 34 కు పెరిగిన కొవిడ్​ కేసులు
  •                 లడఖ్​లో ఇద్దరికి, తమిళనాడులో ఒకరికి పాజిటివ్​

కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా 52 ల్యాబ్ లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటిదాకా వైరస్​ కన్ఫర్మేషన్​ కోసం ఒక్క పుణె నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ (ఎన్​ఐవీ)పైనే ఆధారపడాల్సి వస్తోంది. అనుమానిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వేగంగా టెస్టు చేయాలన్న ఉద్దేశంతో 52 ల్యాబ్ లను ఏర్పాటు చేసింది డిపార్ట్​మెంట్​ ఆఫ్​ హెల్త్​ రీసెర్చ్​. శాంపిల్​ కలెక్షన్​ కోసం మరో 57 ల్యాబ్ లను ఏర్పాటు చేసింది. మన రాష్ట్రంలో ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో టెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. 52 ల్యాబ్ లలో గాంధీ ఆస్పత్రినీ చేర్చింది కేంద్ర ప్రభుత్వం. ఏపీలోని తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​, విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్​ కాలేజీ, అనంతపూర్​లోని జీఎంసీల్లోనూ కరోనా టెస్టింగ్​ ల్యాబ్ లను ఏర్పాటు చేసింది.

మోడీ రివ్యూ

కరోనా పరిస్థితిపై వివిధ ప్రభుత్వ శాఖలతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సమీక్షించారు. క్వారెంటైన్​ ఫెసిలిటీలను పెంచాలని, అందుకు అవసరమైన స్థలాలను చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యాధి మరింత వ్యాపించకుండా క్రిటికల్​ కేర్​కు సంబంధించిన రూల్స్​ను తయారు చేయాల్సిందిగా సూచించారు. జనం ఎక్కడా గుమిగూడకుండా జాగ్రత్తలు సూచించాలని అధికారులకు చెప్పారు. జనాలకు కరోనాపై అవగాహన కల్పించాలని, అందుకు అన్ని డిపార్ట్​మెంట్లు కలసికట్టుగా పనిచేయాలని చెప్పారు. కొవిడ్​ మేనేజ్​మెంట్​కు ప్రపంచ దేశాలు తీసుకుంటున్న బెస్ట్​ పద్ధతులపై స్టడీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇరాన్​లో చిక్కుకున్న ఇండియన్లను వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. కాగా, శనివారం ఇరాన్​లో చిక్కుకున్న 300 మంది ఇండియన్ల శాంపిళ్లను టెస్ట్​ కోసం మహాన్​ ఎయిర్​ఫ్లైట్​లో ఇండియాకు తీసుకొచ్చారు.

34 కేసులు

దేశంలో కొవిడ్​ కేసులు 34కి పెరిగాయి. లడఖ్​లో ఇద్దరికి పాజిటివ్​ వచ్చింది. ఇంకో కేసు తమిళనాడులో నమోదైంది. యూఏఈలో ఓ ఇండియన్​కూ కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. శనివారం 15 కొత్త కేసులు నమోదవగా అందులో ఇండియన్​ ఉన్నాడంటూ యూఏఈ అధికారులు తెలిపారు. కాలిఫోర్నియాలో డాక్​ చేసిన గ్రాండ్​ ప్రిన్సెస్​ షిప్పులో 21 మందికి కొవిడ్​ పాజిటివ్​ వచ్చిందని అమెరికా వైస్​ ప్రెసిడెంట్​ మైక్​ పెన్స్​ చెప్పారు. షిప్పులో మొత్తం 3,500 మంది దాకా ఉన్నారని చెప్పారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ కేసుల సంఖ్య 1,03,950కి చేరింది. 3,524 మంది చనిపోయారు. చైనాలో ఎక్కువగా 3,070 మంది కొవిడ్​కు బలయ్యారు. 80,651 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇటలీలో 197 మంది, ఇరాన్​లో 145 మంది చనిపోయారు. దక్షిణ కొరియాలో 48 మంది చనిపోగా, అమెరికాలో చనిపోయిన వారి సంఖ్య 17కి పెరిగింది.