సంజయ్.. నమ్మినోళ్లను నట్టేట ముంచిండు : గంగుల కమలాకర్

సంజయ్.. నమ్మినోళ్లను నట్టేట ముంచిండు  :  గంగుల కమలాకర్
  •      తుల ఉమకు రావాల్సిన టికెట్​రూ.20కోట్లకు అమ్ముకున్నడు 
  •      బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసిన బండి సంజయ్.. అదే అవినీతి సొమ్ముతో ఓట్లు కొనేందుకు మీ ముందుకు వస్తున్నాడని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు.  కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్, సిటీలోని 56, 59, 60 డివిజన్లలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బొమ్మకల్‌‌లో డప్పు చప్పుళ్లు, బతుకమ్మ, బోనాలతో కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బండి సంజయ్.. వేములవాడ నుంచి బీసీ బిడ్డ తుల ఉమకు టికెట్​ఇస్తామని నమ్మించి, వేరే వ్యక్తికి రూ.రూ.20 కోట్లకు అమ్ముకున్నాడని ఆరోపించారు. సంజయ్ ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ఏదో ఒక డ్రామా ఆడి ఓట్లు దండుకోవాలని చూస్తాడని, ఆయన యాక్టింగ్​లో బ్రహ్మానందం, ప్రకాశ్‌‌రాజ్‌‌ను మించిపోయాడన్నారు. 

భూమాఫియాకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని, ఆయన సర్పంచ్‌‌గా ప్రజలు అవకాశమిస్తే కబ్జాలు చేసిండని, అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే మీ భూములను కబ్జా చేస్తాడని హెచ్చరించారు. ఆయన 12 ఇళ్లు కట్టుకున్నాడని, కానీ జీపీకి బిల్డింగ్ కట్టలేకపోయాడని విమర్శిచారు.  తన కుటుంబం వ్యాపారాలతో డబ్బు సంపాదించిందని, మరి బండి సంజయ్ ఏ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదించారో చెప్పాలని సవాల్ విసిరారు. 

అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాక్.. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్​లోని​అంబేద్కర్ స్టేడియంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, మేయర్ సునీల్‌‌రావుతో కలిసి గంగుల మంగళవారం ఉదయం మార్నింగ్​ వాకర్స్​తో ముచ్చటించారు.  ఇండోర్ స్టేడియంలో సరదాగా కాసేపు షటిల్ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్​  మాట్లాడుతూ 2015లో కరీంనగర్‌‌‌‌ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చడంలో సీఎం కేసీఆర్‌‌‌‌తోపాటు బి.వినోద్ కుమార్ కృషి చేశారన్నారు. 

ALSO READ :  టార్గెట్ కాంగ్రెస్ .. చెన్నూర్​ అభ్యర్థి వివేక్ ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ, ఈడీ రెయిడ్స్

కరీంనగర్ కార్పొరేటర్ల బృందం ఢిల్లీకి వెళ్లినప్పుడు బండి సంజయ్  కార్పొరేటర్‌‌‌‌గానే ఉన్నాడని, స్మార్ట్ సిటీ నిధులు తన వల్లే  వచ్చాయని ఆయన పచ్చి అబద్దాలు చెప్తున్నాడని మండిపడ్డారు. మంత్రితోపాటు సిటీ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, కార్పొరేటర్ రాములు, శ్రీధర్, ప్రశాంత్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్, బిషన్ సింగ్, రమణారెడ్డి, కేంసారం తిరుపతి తదితరులు ఉన్నారు.