రూ. 1.5 లక్షల కోట్లు సేకరించిన ప్రభుత్వం

రూ. 1.5 లక్షల కోట్లు సేకరించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ : 5జీ స్పెక్ట్రమ్ వేలం ద్వారా ప్రభుత్వానికి రికార్డ్ లెవెల్‌‌‌‌లో ఆదాయం వచ్చింది. కిందటేడాది జరిగిన 4జీ వేలంతో రూ. 77,815 కోట్లను సేకరించిన ప్రభుత్వం, తాజాగా ముగిసిన 5జీ వేలంతో రూ. 1.5 లక్షల కోట్లను ఆర్జించింది. ఏడు రోజుల పాటు  కొనసాగిన 5జీ స్పెక్ట్రమ్‌‌ వేలం సోమవారంతో ముగిసింది. టాప్ బిడ్డర్‌‌‌‌‌‌‌‌గా రిలయన్స్ జియో నిలిచింది.  ఈ కంపెనీ రూ. 88,078 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌‌‌‌ కోసం బిడ్స్ వేసింది. రూ. 43,084 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌‌ కోసం ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌, రూ. 18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌‌ కోసం వొడాఫోన్ ఐడియా (వీ) లు బిడ్స్ వేశాయి. గౌతమ్ అదానీ కంపెనీ 400 మెగా హెడ్జ్‌‌‌‌ స్పెక్ట్రమ్‌‌‌‌ కోసం రూ. 212 కోట్లను ఖర్చు చేసింది.  5జీ వేలంలో మొత్తం 72,098 మెగాహెడ్జ్‌‌‌‌ స్పెక్ట్రమ్‌‌‌‌ను వేలానికి ఉంచగా, 51,236 మెగాహెడ్జ్‌‌‌‌ లేదా 71% స్పెక్ట్రమ్‌‌‌‌ అమ్ముడయ్యిందని టెలికం మినిస్టర్‌‌‌‌‌‌‌‌ అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. జియో ఏకంగా 24,740 మెగా హెడ్జ్ స్పెక్ట్రమ్‌‌‌‌ కోసం బిడ్స్ వేసింది. ఒకే టవర్‌‌‌‌‌‌‌‌ నుంచి 6–10 కి.మీ రేంజ్‌‌‌‌లో సేవలందించగలిగే 700 మెగా హెడ్జ్‌‌‌‌ స్పెక్ట్రమ్‌‌‌‌ను మొత్తం 22 సర్కిల్స్‌‌లో జియో కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌‌‌‌ టెలికం సర్కిల్‌‌‌‌ (తెలంగాణ, ఆంధ్ర) కోసం 700 మెగాహెడ్జ్‌‌‌‌, 3,300 మెగాహెడ్జ్‌‌‌‌, 26 గిగా హెడ్జ్‌‌‌‌ బ్యాండ్‌‌‌‌లలోని స్పెక్ట్రమ్‌‌‌‌ను కంపెనీ కొన్నది.  ప్రైవేట్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ (కంపెనీల కోసం) ను అందించడానికి 26 గిగా హెడ్జ్‌‌‌‌ బ్యాండ్‌‌‌‌లోని స్పెక్ట్రమ్‌‌‌‌ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది.   మొత్తం ఐదు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలోని 19,867 మెగా హెడ్జ్ స్పెక్ట్రమ్‌‌‌‌ను  ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ కొనుగోలు చేసింది.  కానీ, 700 బ్యాండ్‌‌‌‌లోని స్పెక్ట్రమ్‌‌‌‌ను మాత్రం కొనలేదు. వీ 6,228 మెగా హెడ్జ్‌‌‌‌ స్పెక్ట్రమ్‌‌‌‌ కోసం బిడ్స్ వేసింది. మొదటి సారిగా వేలంలోకి తెచ్చిన 600 మెగా హెడ్జ్ బ్యాండ్ కోసం ఎవరూ బిడ్స్ వేయలేదని వైష్ణవ్ అన్నారు. కంపెనీలు వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌‌‌‌తో ఇంకో రెండు నుంచి మూడేళ్లలో దేశం మొత్తం మీద 5జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను అందించడానికి వీలుంటుందని అన్నారు. స్పెక్ట్రమ్‌‌‌‌ కేటాయింపులను ఆగస్టులో చేస్తారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నుంచి 5జీ సర్వీస్‌‌‌‌లు అందుబాటులోకి వస్తాయి. 

3జీ వేలం కంటే 3 రెట్లు ఎక్కువగా..
ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌, జియోలు దేశం మొత్తం మీద 5జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను అమల్లోకి తేనున్నాయి. వీ మాత్రం  కొన్ని నిర్ధిష్టమైన టెలికం సర్కిళ్లలోనే  5జీని అమలు చేయనుంది. తాజా వేలంలో ప్రభుత్వం మొత్తం 10 బ్యాండ్లలోని స్పెక్ట్రమ్‌‌‌‌ను అమ్మకానికి  ఉంచింది. 3300 మెగా హెడ్జ్‌‌‌‌, 26 గిగా హెడ్జ్ బ్యాండ్ల కోసం ఎక్కువ బిడ్స్ వచ్చాయి. గత రెండు టెలికం ఆక్షన్లలో అమ్ముడు కాని 700 మెగా హెడ్జ్ బ్యాండ్‌‌‌‌ కోసం ఈసారి బాగానే బిడ్స్ వచ్చాయి. 1800, 900 మెగా హెడ్జ్ బ్యాండ్లకు కూడా డిమాండ్ కనిపించింది. 20 ఏళ్లకు గాను ఈ స్పెక్ట్రమ్‌‌ను కంపెనీలకు కేటాయిస్తారు. 20 వాయిదాల్లో(ఏడాదికి) పేమెంట్  చేయాల్సి ఉంటుంది. ఏడాదికి 7.2 % వడ్డీ చెల్లించాలి.