న్యూఢిల్లీ: ఈ నెల 30 నాటికి 2022-–23 ఆర్థిక సంవత్సరానికి గాను 6 కోట్ల ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ అయ్యాయి. కిందటేడాది జులై 31 నాటికి ఫైల్ అయిన ఐటీఆర్‌ల నెంబర్‌ను డెడ్‌లైన్ కంటే ఒకరోజు ముందు దాటేశాం. కాగా, ఐటీఆర్‌ను ఫైల్ చేయడానికి సోమవారమే చివరి తేది. ‘ఆదివారం సాయంత్రం 6.30 నాటికి 6 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయి. ఒక్క రోజే 26.76 లక్షల ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయి’ అని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ట్వీట్ చేసింది. శనివారం ఏకంగా 1.78 కోట్ల ఈఫైలింగ్ లాగిన్స్ జరగగా, ఆదివారం 1.30 కోట్ల సక్సెస్‌ఫుల్ లాగిన్స్ జరిగాయని పేర్కొంది. ఐటీఆర్ ఫైలింగ్‌లో సపోర్ట్ చేయడానికి 24x7 బేసిస్‌లో హెల్ప్ డెస్క్ పనిచేస్తోందని, కాల్స్, లైవ్‌చాట్స్, వెబెక్స్ సెషన్లు, సోషల్ మీడియా ద్వారా సాయం అందిస్తున్నామని ఐటీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
ఈవెరిఫై చేసుకోవాలి..
ఐటీఆర్ ఫైల్ చేయడం సగం పని మాత్రమే. రిటర్న్ ఫైల్ చేసిన 30 రోజుల్లోపు ఈవెరిఫై పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీంతో వెరిఫై చేసుకోవచ్చు. అంతేకాకుండా ముందే వ్యాలిడేట్ అయిన బ్యాంక్ అకౌంట్ లేదా డీమాట్ అకౌంట్ ద్వారా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) ను జనరేట్ చేయొచ్చు. ఏటీఎం (ఆఫ్ లైన్) లేదా నెట్‌బ్యాంకింగ్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ మార్గాల్లోనూ ఈ–వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చు.
-
