జ్యోతి మల్హోత్రాకు పాక్లో వీవీఐపీ ట్రీట్మెంట్.. ఏకే 47 వెపన్లతో వెన్నంటి ఉన్న ఆరుగురు గన్ మెన్లు

జ్యోతి మల్హోత్రాకు పాక్లో వీవీఐపీ ట్రీట్మెంట్.. ఏకే 47 వెపన్లతో వెన్నంటి ఉన్న ఆరుగురు గన్ మెన్లు
  • లాహోర్లోని అనార్కలీ బజార్ ​సందర్శించిన జ్యోతి
  • ఏకే 47 వెపన్లతో వెన్నంటి ఉన్న ఆరుగురు గన్ మెన్లు
  • స్కాట్లాండ్ యూట్యూబర్ వీడియో ద్వారా వెలుగులోకి

న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తోందనే ఆరోపణలతో అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ లో ఆమెకు వీవీఐపీ ట్రీట్మెంట్ అందిందని, విమానంలో ఫస్ట్ క్లాస్ ప్రయాణం చేయడంతో పాటు ఖరీదైన హోటళ్లలో బస చేసిందని తేలింది. గత మార్చిలో జ్యోతి పాకిస్తాన్​లో పర్యటించింది. ఈ సందర్భంగా లాహోర్లోని అనార్కలీ బజార్ సందర్శించింది. మరికొంతమందితో కలిసి సెల్ ఫోన్​లో వీడియోలు షూట్ చేసింది. అయితే, ఆరుగురు గన్ మెన్లు అత్యాధునిక ఏకే 47 గన్స్ తో ఆమె వెనకే తిరిగారు. అదే సమయంలో అక్కడే వీడియోలు తీసుకుంటున్న స్కాట్లాండ్ యూట్యూబర్ కాలమ్ మిల్ తన కెమెరాతో రికార్డు చేశాడు.

అనార్కలీ బజార్లో ఈ స్థాయి సెక్యూరిటీతో ఆమె ఎందుకు తిరుగుతుందనేది తనకు అర్థం కాలేదని వీడియోలో చెప్పుకొచ్చాడు. జ్యోతిని పలకరించి పాకిస్తాన్ ఆతిథ్యం ఎలా ఉందని ప్రశ్నించగా.. చాలా బాగుందని  జ్యోతి జవాబిచ్చింది. జ్యోతి వెంట ఏకే 47 ఆయుధాలతో ఆరుగురు గన్ మెన్లు ఉండడం వీడియోలో కనిపిస్తోంది. వారిలో నలుగురు సివిల్ డ్రెస్లో ఉండగా మిగతా ఇద్దరు పాక్ పోలీస్ యూనిఫాంలో కనిపించారు. కాగా, పాక్ పర్యటనలో జ్యోతి హైప్రొఫైల్ పార్టీల్లో పాల్గొనేదని, అక్కడ ఐఎస్ఐకి సంబంధించిన ఉన్నతాధికారులను పరిచయం చేసుకునేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత కూడా జ్యోతి వారితో కాంటాక్ట్ లో ఉందని అధికారులు గుర్తించారు. పాక్లో ఆమెకు లభించిన వీవీఐపీ ట్రీట్మెంట్ చూస్తే ఆ దేశంలో జ్యోతికి ఏ స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, పాక్  పర్యటన తర్వాత జ్యోతి చైనాలో పర్యటించిందని, ఈ టూర్ లోనూ ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయడం, ఫేమస్  గోల్డ్ షాపులను సందర్శించడం చేసిందని అధికారులు తెలిపారు. దీంతో జ్యోతి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి సారించినట్లు వారు తెలిపారు. అదేవిధంగా జ్యోతి ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలను సైబర్ వింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని అధికారులు తెలిపారు.