
- మహబూబాబాద్ జిల్లా నారాయణపురంలో దారుణం
నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : ఇంట్లో పడుకున్న చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో గురువారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పందుల ఉపేందర్, శిరీష దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్దకుమారుడైన మునీశ్‌కుమార్ (6) బుధవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో పడుకున్నాడు. గురువారం తెల్లవారుజామున మునీశ్‌కుమార్ ఒక్కసారిగా కేకలు వేయడంతో తండ్రి ఉపేందర్, నానమ్మ లేచి చూశారు.
బాలుడి మెడపై కత్తిగాట్లు కనిపించడంతో వెంటనే ఆర్‌ఎంపీ వద్దకు అక్కడి నుంచి మహబూబాబాద్ తీసుకెళ్లగా ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మురళీనాయక్ హాస్పిటల్‌కు వెళ్లి చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇంటి ముందున్న డోర్‌కు గడియ లేకపోవడంతో దుండగులు వచ్చి దాడి చేశారని తెలుస్తోంది.