
- 542 లోక్‌సభ స్థానాలకు ముగిసిన ఎన్నికలు.. ఏడు దశల్లో కలిపి 66.62% పోలింగ్
- 2014లో 66.40 శాతం.. చివరిదైన ఏడో దశలో 64 శాతం టర్నౌట్
- బెంగాల్లో హింస.. ఓ పోలింగ్ బూత్ వద్ద బాంబు పేలుడు ఫేజ్‌లవారీగా పోలింగ్ సీన్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ ఈవెంట్ విజయవంతంగా పూర్తైంది. ఆదివారం జరిగిన ఏడో విడత పోలింగ్‌తో దేశవ్యాప్తంగా ఓట్ల పండుగ ముగిసింది. 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 542 లోక్‌సభ స్థానాల్లో ఓటింగ్ పక్రియ పూర్తైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏడు దశల్లో కలిపి యావరేజ్‌గా 66.62 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 90 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లుండగా, అందులో సుమారు 60 కోట్ల మంది ఓట్లేశారు. ప్రజాస్వామిక హక్కును వాడుకోవడంలో నార్త్ ఇండియన్ల కంటే సౌత్ ఇండియన్లు మరోసారి చైతన్యం ప్రదర్శించారు. తొలి నాలుగు ఫేజ్‌లతో పోల్చుకుంటే, చివరి మూడు దశల్లో ఓటింగ్ తగ్గడమే అందుకు నిదర్శనం. ఏడు ఫేజ్‌ల్లో ఎన్నికల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ, 23 నాటి కౌంటింగ్‌కు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ స్థానంలో ఎన్నిక రద్దైన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో మొత్తం 66.40 శాతం ఓటింగ్ రికార్డయింది. ఈసారి స్వల్పంగా పెరిగింది.
ఏడో ఫేజ్‌లో 64 శాతం
ఏడో ఫేజ్‌లో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. చాలా చోట్ల ఈవీఎంలలో లోపాలు తలెత్తాయి. యావరేజ్‌గా 64.5 శాతం ఓటింగ్ జరిగినట్లు ఈసీ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాలకుగానూ 56.84 శాతం, పంజాబ్(13)లో 64.71 శాతం, వెస్ట్‌బెంగాల్(9)లో 73.51 శాతం, హిమాచల్ ప్రదేశ్(4)లో 70.40, జార్ఖండ్(4)లో 71.16, మధ్యప్రదేశ్(8)లో గరిష్టంగా 75.38 శాతం, బీహార్(8)లో అతి తక్కువగా 53.36 శాతం పోలింగ్ నమోదైంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఓటింగ్ శాతం 58.10గా రికార్డైంది.
బెంగాల్లో మళ్లీ హింస
తొలిసారిగా ఈసీ ఆర్టికల్ 324 ప్రయోగించిన వెస్ట్‌బెంగాల్‌లో ఏడో దశలోనూ హింస ప్రజ్వరిల్లింది. కోల్‌కతా సిటీతోపాటు పోలింగ్ జరిగిన 9 స్థానాల్లో టీఎంసీ, బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. పలు చోట్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల బాంబు దాడులు జరిగాయి. ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ బీజేపీ, టీఎంసీ వర్గీయులు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. పంజాబ్‌లోనూ హింస నమోదైంది. కాంగ్రెస్, అకాలీదళ్ కార్యకర్తల మధ్య కొట్లాటలు జరిగాయి.