
- బిహార్‌లోని ఢిల్లీ-కోల్‌కతా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
- 65 కి.మీ. మేర నిలిచిన వాహనాలు
- తిండి, నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్న డ్రైవర్లు, ప్రయాణికులు
పాట్నా: బిహార్‌లోని ఢిల్లీ–కోల్‌కతా నేషనల్ హైవే(ఎన్‌హెచ్ 19)పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏకంగా 65 కిలోమీటర్ల మేర వందలాది వెహికల్స్ నిలిచాయి. నాలుగు రోజులుగా హైవే పైనే చిక్కుకుపోయాయి. దీంతో డ్రైవర్లు, ప్రయాణికులు తిండి, నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
బిహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో గత శుక్రవారం కుండపోత వర్షాలు కురిసాయి. దాంతో ఎన్‌హెచ్ 19పై ఆరు లేన్ల రోడ్డు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక మళ్లింపులు, సర్వీస్ రోడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో వాటి నిండా నీరు నిలిచింది. వెహికల్స్ బురదలో కూరుకుపోతుండటంతో ట్రాఫిక్ గంటగంటకు తీవ్రమవుతున్నది. రోహ్తాస్ జిల్లాలో మొదలైన ట్రాఫిక్ జామ్ దాదాపు 65 కి.మీ. దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు విస్తరించింది.
పరిస్థితి దారుణంగా ఉంది
ఢిల్లీ–కోల్‌కతా నేషనల్ హైవేపై ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని నాలుగు రోజులుగా ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయిన బాధితులు తెలిపారు. వాహనాలు 24 గంటల్లో కేవలం 5 కి.మీ. మాత్రమే ముందుకు కదిలామని చెప్పారు. గడిచిన 30 గంటల్లో తాము కేవలం 7 కిలోమీటర్లే ప్రయాణించామని వివరించారు. ట్యాక్స్‌లు కడుతున్నా గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది, స్థానిక అధికారులు అసలు కనిపించడమే లేదని మండిపడ్డారు. ట్రాఫిక్ జామ్ వల్ల పండ్లు, కూరగాయలు వంటి త్వరగా పాడైపోయే సరుకులను రవాణా చేస్తున్న డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్సులు, టూరిస్ట్ వెహికల్స్, పాదచారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నాలుగు రోజులుగా తాము ఆకలి, దాహంతో, దయనీయ స్థితిలో ఉన్నామని.. వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేయాలని కోరారు.