ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్

ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్

ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ కోసం యాంగర్ ఇండెక్స్ పేరుతో సీఓటర్ సంస్థ సర్వే నిర్వహించింది.  ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న టాప్ 5 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో దాదాపు మూడింట రెండు వంతుల మంది అంటే.. 66.8శాతం మంది ప్రజలు KCR సర్కార్ పై అసంతృప్తిగా ఉన్నట్టు సంస్థ తెలిపింది. ఏపీలో 56.9శాతం మంది ప్రజలు జగన్ సర్కార్ పై ఆగ్రహంగా ఉన్నారు. జనం అసంతృప్తిలో ఏపీ నాలుగో స్థానంలో ఉంటే...  2,3 స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ నిలిచాయి. 

ఏపీలో 33.2శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత...

ప్రజల నుంచి అతి తక్కువ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సీఎంల జాబితాలో ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్ మొదటి స్థానంలో ఉండగా... తెలంగాణ సీఎం KCR చివరి స్థానంలో ఉన్నారు.  సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తెలంగాణలో 23.5శాతం ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. ఏపీలో 33.2శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. దేశంలోనే అత్యధికంగా ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రిగా 34.5శాతంతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మొదటి స్థానంలో ఉన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాలనపై 28శాతం మంది మాత్రమే ఆగ్రహంగా ఉన్నారు. ఈ జాబితాలో తెలంగాణ సీఎం KCR అట్టడుగున నిలిచారు. 

కేంద్ర మంత్రులపైనే ఎక్కువ నమ్మకం...

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై జనంలో సంతృప్తిగా ఉన్నప్పటికీ స్థానిక పాలనపై మాత్రం తీవ్ర అసంతృప్తి కనిపించింది. అలాగే తెలంగాణ స్థానిక పాలనపై 5.4 శాతం మాత్రమే అసంతృప్తి ఉంది. సర్వేలో పాల్గొన్న వాళ్ళల్లో చాలా మంది తమ రాష్ట్ర నాయకత్వాల కన్నా... కేంద్ర మంత్రులపైనే ఎక్కువ నమ్మకం ప్రకటించారు. ప్రజలు ఇష్టపడిన ముఖ్యమంత్రుల రాష్ట్రాల్లోనూ... ఎమ్మెల్యేలపైనే అసంతృప్తి ఎక్కువగా ఉంది. ప్రధాని నరేంద్రమోడీపై ఛత్తీస్ గడ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ లో తక్కువ అసంతృప్తి ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీయేతర ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వాలపైనే ప్రజా వ్యతిరేకత...

దేశంలో కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్టు. IANS-CVOTER ఒపీనియన్ పోల్ లో తేలింది. 46.6శాతం మంది తమ రాష్ట్ర ప్రభుత్వాలపై అసంతృప్తి వ్యక్తం చేయగా... 34.8శాతం మంది మాత్రమే కేంద్ర ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు.  కేంద్ర ప్రభుత్వంపై అతి తక్కువ ఆగ్రహం ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్ తెలంగాణ ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో సగటున 24.6శాతం మంది ఓటర్లు తమ ముఖ్యమంత్రులపైన, 11.2శాతం మంది తమ ఎమ్మెల్యేలపైనా అసంతృప్తిగా ఉన్నట్టు తేలింది. సర్వే కోసం సీఓటర్ సంస్థ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత జులై నుంచి సెప్టెంబర్ దాకా 3 నెలల కాలంలో 25వేల మందిని ప్రశ్నించింది. 11 భాషల్లో ఈ సర్వే నిర్వహించారు.