గంటకు 7యాక్సిడెంట్లు.. రోజుకు 18 మంది బలి

గంటకు 7యాక్సిడెంట్లు.. రోజుకు 18 మంది బలి
  • జనవరి నుంచి అక్టోబర్‌దాకా14,864 యాక్సిడెంట్లు ..5,209 మంది మృతి
  • గ్రేటర్ లో ఎక్కువ..భూపాలపల్లిలో తక్కువ
  • నిర్లక్ష్యం, అతివేగం,మానవ తప్పిదాలే కారణం
  • అధ్వానంగా రోడ్లు , కానరానిసైన్, వార్నింగ్ బోర్డులు

హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్రంలో రోడ్లు రక్తమోడుతున్నయి. రోజూ ఎక్కడో ఒక చోట మేజర్‌‌ యాక్సిడెంట్ జరుగుతున్నది. ప్రతి రోజూ యావరేజ్ గా165 రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతుండగా, 18 మంది ప్రాణాలు బలైపోతున్నయి. వేల మంది గాయాలపాలవుతున్నారు. గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ పరిధిలో, ప్రధానంగా సైబరాబాద్ పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, మానవ తప్పిదాలకు తోడు సర్కారు, అధికార యంత్రాంగం అలసత్వమే యాక్సిడెంట్లకు ప్రధాన కారణాలని నిపుణులు చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి.అనేక చోట్ల సైన్ బోర్డులు, వార్నింగ్ బోర్డులు కూడా లేకపోవడంతో యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి.

నెలకు 520 ప్రాణాలు గాల్లోకి..

రాష్ట్రంలో రోజూ ఎక్కడో ఓ చోట మేజర్‌‌ యాక్సిడెంట్‌‌ జరుగుతోంది. ఇద్దరు ముగ్గురు దుర్మరణం చెందుతున్న ప్రమాదాలు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. కరోనాతో రెండు నెలలకు పైగా లాక్‌‌డౌన్‌‌ అమల్లో ఉన్నా.. ఈ ఏడాది ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గలేదని లెక్కలు చెబుతున్నాయి. జనవరి నుంచి అక్టోబర్‌‌ వరకు 14,864 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 5,209 మంది మరణించారు. అంటే నెలకు యావరేజ్ గా 520 మంది, రోజుకు 18 మంది వరకు యాక్సిడెంట్లలో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.

సైబరాబాద్ లోనే ఎక్కువ మరణాలు

గ్రేటర్‌‌ పరిధిలోనే, ప్రధానంగా సైబరాబాద్ ఏరియాలోనే ప్రమాదాలు, మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. సైబరాబాద్‌‌ కమిషనరేట్‌‌ పరిధిలో 582 మంది, రాచకొండ పరిధిలో 466 మంది మరణించగా, హైదరాబాద్‌‌లో193 మంది యాక్సిడెంట్లలో చనిపోయారు. జిల్లాల వారీగా తీసుకుంటే సంగారెడ్డిలో 623 ప్రమాదాలు జరగ్గా, 300 మంది మృత్యువాత పడ్డారు. వరంగల్‌‌ కమిషనరేట్‌‌లో 292,  గద్వాలలో 252, నిజామాబాద్‌‌లో 250 మంది చొప్పున మరణించారు. జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లాలో అతి తక్కువగా129 యాక్సిడెంట్స్‌‌ కాగా, 49 మంది చనిపోయారు.

సిటీలో అర్ధరాత్రే..

గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ పరిధిలో రాత్రి11 నుంచి తెల్లవారుజామున 2.30 గంటల మధ్య టైంలోనే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి11 దాటిన తర్వాత రోడ్లపై ట్రాఫిక్ రద్ధీ తక్కువగా ఉండడంతో పాటు పోలీసుల నిఘా కూడా ఉండకపోవడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని రోడ్లతో పాటు ఓఆర్ఆర్‌‌పై, ఫ్లై ఓవర్స్‌‌, నెక్లెస్ రోడ్స్, ట్యాంక్ బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో యువత, పోకిరీలు జోరుగా బైక్ రేసింగ్‌‌లు చేస్తున్నారు.

మేజర్ యాక్సిడెంట్లప్పుడే హడావుడి

ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ కంటే ప్రాణాలు ముఖ్యం అన్న విషయాన్ని డ్రైవర్లు పెడచెవిన పెడుతున్నారు. అయితే ఏ రోడ్డుపై ఎంత వేగంతో వెళ్లాలి? వాహనాలను ఎలా ఓవర్‌‌ టేక్‌‌ చేయాలి? ఎలాంటి రూల్స్ పాటించాలి? తదితర విషయాలపై అవగాహన లేకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ యాక్సిడెంట్లు జరిగినప్పుడే ఆర్టీఏ, పోలీసు అధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా లైసెన్స్‌‌ల జారీలో ఆర్టీఏ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఆ రాష్ట్రాల్లో తగ్గుముఖం..

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త మోటార్ వెహికల్ (సవరణ) యాక్ట్‌‌ను రాష్ర్టంలో అమలు చేయలేదు. ఇతర రాష్ట్రాల్లో ఈ చట్టం అమలు తీరును పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పత్తా లేకుండా పోయింది. కొత్త చట్టం అమలు చేస్తున్న చోట్ల ప్రమాదాలు, రూల్స్ వాయిలేషన్‌‌ కేసులు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. డ్రంకన్‌‌ డ్రైవ్‌‌, ర్యాష్‌‌ డ్రైవింగ్‌‌, సిగ్నల్‌‌ జంప్‌‌, హెల్మెట్‌‌ లేకపోవడం తదితర అంశాల్లో కేసులు తగ్గాయి. కొత్త చట్టంతో భారీ ఫైన్లు, శిక్షలకు భయపడి రూల్స్ పాటిస్తున్నారని అంటున్నారు. రూల్స్ స్ట్రిక్ట్ గా ఉన్న చండీగఢ్‌‌, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్‌‌, గుజరాత్‌‌, బిహార్‌‌ రాష్ట్రాల్లో 20 నుంచి 40 శాతం వరకు ప్రమాదాలు తగ్గాయని చెప్తున్నారు.

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. రహదారులు గుంతలుగుంతలు, కంకర తేలి, డాంబర్‌‌ లేకుండా అధ్వాన్నంగా ఉన్నాయి. పల్లెల్లో మూలమలుపులు మృత్యుమలుపులుగా మారుతున్నాయి. రోడ్లపైకి మూసుకుపోయిన చెట్ల కొమ్మలు యమపాశాలవుతున్నాయి. మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు, హెచ్చరిక బోర్డులు, లైట్లు కూడా లేక దగ్గరికి వచ్చే వరకు ఎదుటి వాహనం కనిపించడం లేదు. కాల్వలు ఉన్న వద్ద సైడ్ వాల్స్‌‌ లేవు. అనేక ప్రాంతాల్లో నేటికీ రోడ్డు పక్కన పాడుబడ్డ బావులుకన్పిస్తున్నాయి. అక్కడ ఎలాంటి గోడలు, బోర్డులు పెట్టడంలేదు. అయితే మానవ తప్పిదాలు, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఓవర్ స్పీడ్, సెల్‌‌ఫోన్‌‌ డ్రైవింగ్‌‌, ఓవర్ టేక్, ఓవర్ లోడ్, నో హెల్మెట్‌‌, డ్రంకన్‌‌ డ్రైవ్‌‌, రాంగ్‌‌రూట్‌‌ డ్రైవింగ్, నో సీట్‌‌బెల్ట్‌‌ వంటి తప్పిదాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

ఇటీవలి భారీ యాక్సిడెంట్లు ఇవే..

  • నగరంలోని గచ్చిబౌలిలో టిప్పర్‌‌ను కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు.
  • హైదరాబాద్-– సాగర్ రహదారిపై ఓ కారు అతివేగంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారు.
  • వరంగల్‌‌ రూరల్‌‌ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్‌‌ వద్ద ఇసుక లారీ కారును ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు.
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించారు.