ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల మంది వలస

ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల మంది వలస
  • ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల మంది వలస
  • 2022లో 2021 కంటే 60 శాతం ఎక్కువ
  • ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌-రష్యా యుద్ధం, పాక్​లో వరదలతో భారీగా పెరుగుదల
  • సొంత దేశంలోనే ఇతర ప్రాంతాలకు వెళ్లినోళ్లపై  ఐడీఎంసీ, ఎన్ఆర్​సీ రిపోర్ట్


జెనెవీ: నిరుడు ప్రపంచ వ్యాప్తంగా 7.11 కోట్ల మంది బతుకుజీవుడా అంటూ తాము పుట్టిపెరిగిన ప్రాంతాన్ని వదిలి వలసపోయారు. ఇందులో ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌–రష్యా యుద్ధం, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను ముంచెత్తిన వరదలతో ప్రభావితమైన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇంటర్నల్ డిస్‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్ మానిటరింగ్ సెంటర్ (ఐడీఎంసీ), నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ (ఎన్ఆర్​సీ) కలిసి గురువారం వెల్లడించిన రిపోర్టు ప్రకారం అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 60 శాతం ఎక్కువ. తమ దేశ సరిహద్దులలోపే అంతర్గతంగా బతుకవోయినోళ్లపై ఈ సర్వే నిర్వహించారు. తమ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారిని ఇందులో పరిగణనలోకి తీసుకోలేదు. 2021లో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో 3.8 కోట్ల మంది ఇతర ప్రాతాలకు వెళ్లగా 2022 లో అది దాదాపు డబుల్ అయింది. 

ఇప్పటి వరకు ఉన్న అంతర్గత వలసల రికార్డులలో పోలిస్తే ఇదే అత్యధికమని ఐడీఎంసీ చీఫ్ అలెగ్జాండ్రా బిలక్ మీడియాకు తెలిపారు. ‘‘ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌–రష్యా యుద్ధం, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లో భారీ వరదలు, వివిద దేశాల్లో కొత్తగా తలెత్తుతున్న, కొనసాగుతున్న సంఘర్షణలు, విపత్తుల వల్ల ఈ వలసల్లో భారీ పెరుగుదల కనిపించింది” అని అన్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి 2022 చివరి నాటికి ఉక్రెయిన్​లో 5.9 మిలియన్ల మంది ప్రజలు తమ దేశంలోనే ఇతర సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లారు. సిరియాలో ఒక దశాబ్దానికి పైగా కొనసాగుతున్న అంతర్యుద్ధంతో 6.8 మిలియన్ల మంది సొంత ప్రాంతాన్ని విడిచి వెళ్లారు. వరదలు, కరువు వంటి విపత్తుల కారణంగా పలు దేశాల్లో నిరాశ్రయులైన, జీవనాధారం కోల్పోయి వలస వెళ్లిన వారి సంఖ్య 2021 లో కంటే 45 శాతం పెరిగింది.

ఆహార భద్రత సంక్షోభం

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అంతర్గత వలసల్లో మూడొంతులు కేవలం 10 దేశాలలో ఉంటున్నాయి. సిరియా, ఆఫ్గానిస్తాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉక్రెయిన్, కొలంబియా, ఇథియోపియా, యెమెన్, నైజీరియా, సోమాలియా, సూడాన్ దేశాలలో ఉన్నట్లు ఈ రిపోర్టు పేర్కొంది. ఏండ్లుగా పరిష్కారం కాని వివాదాలు, ఘర్షణలు, ప్రకృతి వైపరిత్యాలు ఇందుకు ప్రధాన కారణమని వివరించింది. ‘సంఘర్షణలు, విపత్తులు ప్రజలలో అసమానతలను తీవ్రంగా పెంచాయి. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌లో యుద్ధం ప్రపంచ ఆహార భద్రత సంక్షోభానికి ఆజ్యం పోసింది. ఇది అంతర్గతంగా వలస పోయిన వారిని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. వరదలు, అంతర్గత సంక్షోభాల వల్ల పాక్​లో ఆహార భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడింది” అని ఎన్ఆర్​సీ చీఫ్ జాన్​ఎజెలాండ్​ తెలిపారు.