యూరప్‌‌లో ఒమిక్రాన్ కేసులు వారంలో 70 లక్షలు!

యూరప్‌‌లో ఒమిక్రాన్ కేసులు వారంలో 70 లక్షలు!

వాషింగ్టన్/న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు యూరప్ విలవిల్లాడుతోంది. ఈ నెల తొలి వారంలో 70 లక్షల ఒమిక్రాన్ కేసులు అక్కడ నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గత రెండు వారాలతో పోలిస్తే ఇది రెట్టింపు అని చెప్పింది. ‘‘యూరప్‌‌లో 26 దేశాల్లోని ఒక శాతం జనాభా ప్రతి వారం కరోనా బారిన పడుతున్నది. ఆయా దేశాల్లోని హెల్త్ సిస్టమ్స్‌‌పై ఒత్తిడి పెరుగుతున్నది. పరిస్థితిని అదుపు చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలు మూసుకుపోతున్నాయి” అని డబ్ల్యూహెచ్‌‌వో యూరప్ డైరెక్టర్ హాన్స్ క్లగ్ చెప్పారు. వచ్చే 6 నుంచి 8 వారాల్లో వెస్టర్న్ యూరప్‌‌లోని సగం జనాభా కరోనా బారిన పడే అవకాశం ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌‌ వాషింగ్టన్‌‌లోని ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్‌‌ అంచనా వేసిందని పేర్కొన్నారు. ‘‘మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఇండ్లలోనూ మాస్క్‌‌లు వేసుకోవాలి. వ్యాక్సిన్‌‌ను ప్రాధాన్యతా క్రమంలో ఇవ్వాలి. రిస్క్‌‌ ఉన్నోళ్లకు బూస్టర్ డోసులు వేయాలి” అని సూచించారు. వ్యాక్సినేషన్ స్లోగా ఉన్న దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. డెన్మార్క్‌‌లో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లతో పోలిస్తే వేసుకోనోళ్లు ఆరు రెట్లు ఎక్కువగా ఆస్పత్రుల్లో చేరుతున్నారని తెలిపారు.

కాస్త తగ్గిన కొత్త కేసులు

గత 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. సోమవారం 1.79 లక్షల మందికి వైరస్ సోకగా.. మంగళవారం 1.68 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. యాక్టివ్  కేసులు 8,21,446కి చేరాయి. 24 గంటల్లో 277 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 3,58,75,790కి, డెత్స్ సంఖ్య 4,84,213కి పెరిగింది. రికవరీ రేటు 96.36 శాతానికి పడిపోయింది. డైలీ పాజిటివిటీ రేట్ 10.64 శాతంగా నమోదైంది. ఇక ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,461కి పెరిగింది. ఇందులో 1,711 మంది కోలుకున్నారు లేదా దేశం నుంచి వెళ్లిపోయారు. కొత్త వేరియంట్ కేసుల్లోనూ మహారాష్ట్రనే ముందుంది. అక్కడ 1,247 మంది, రాజస్థాన్​లో 645మంది, ఢిల్లీలో 546మంది, కర్నాటకలో 479 మంది, కేరళలో 350 మందికి కొత్త వైరస్ సోకింది. 

ఒమిక్రాన్‌‌లో 3-4 రకాలు!

ఒమిక్రాన్‌‌ వేరియంట్‌‌లో మూడు, నాలుగు రకాలు ఉన్నాయని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌‌టీఏజీఐ) చైర్మన్ ఎన్‌‌కే ఆరోరా చెప్పారు. రోగ నిర్ధారణ విషయంలో ఇవి వేర్వేరుగా ఉండొచ్చని, కానీ వాటి ఎపిడెమియోలాజికల్ బిహేవియర్ మాత్రం ఒకేలా ఉంటుందని అన్నారు. ఇన్ఫెక్షన్లు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. వ్యాక్సినేషన్, కరోనా రూల్స్ ఫాలో కావడంతోపాటు కర్ఫ్యూలాంటి చర్యలు.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఉపయోగపడుతయన్నారు.