 
                                    - జలదిగ్బంధంలో 40కిపైగా కాలనీలు
- ఎగువ గొలుసుకట్టు చెరువుల వరదనీరంతా సిటీవైపు
- కేయూ 100 ఫీట్ల రోడ్డు కాలనీల్లో ఊర చెరువు బీభత్సం
- రంగంలోకి దిగిన ఎన్డీఆర్‍ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు
- ముమ్మరంగా సహాయక చర్యలు..
- సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు
- హనుమకొండ, వరంగల్ వరదల్లో ముగ్గురు మృతి
వరంగల్, వెలుగు: మొంథా తుఫాన్ ధాటికి ఓరుగల్లు ఆగమైంది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కుండపోత వాన, ఈదురుగాలులకు జనం వణికిపోయారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత తుఫాన్ ఆగి.. గురువారం ఉదయం ఎండకొట్టినా వందలాది కాలనీలు, ఇండ్లన్నీ వరద నీటిలోనే చిక్కుకున్నాయి.
వరంగల్, హనుమకొండ నగరాలకు ఎగువ భాగంలో ఉండే గొలుసు కట్టు చెరువులు ఒక్కొక్కటిగా పొంగుతూ అన్నీ ఒకటిగా కలిసివచ్చి సిటీ మీద పడటంతో గురువారం ఉదయం 11 వరకు గంటగంటకు వరద పెరిగింది. దీని ఎఫెక్ట్ హనుమకొండలోని కేయూ 100 ఫీట్ల రోడ్ కాలనీలపై పడింది. ఎన్డీఆర్‍ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సహాయ చర్యల కోసం పడవలతో సిద్ధంగా ఉన్నా.. వరద ఉధృతికి వారు అనుకున్న గమ్యస్థానాలకు చేరుకోవడం సాధ్యపడలేదు.
దీంతో ఇండ్లలోకి నీరు వచ్చిన కుటుంబాలు స్లాబ్ మీదికి వెళ్లి బిక్కుబిక్కుమంటూ గడిపారు. మంత్రి కొండా సురేఖ వరంగల్‌లో, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి , వరంగల్ ఎంపీ కడియం కావ్య హనుమకొండలో అధికారులను అప్రమత్తం చేసి సహయక చర్యల్లో పాల్గొన్నారు.
హనుమకొండను ముంచిన ఊర చెరువు
హనుమకొండ సిటీ కేయూ 100 ఫీట్ల రోడ్డుకు దగ్గర్లో ఉండే గోపాల్‍పూర్ ఊర చెరువు దాదాపు 10 నుంచి 15 కాలనీలను ముంచింది. హనుమకొండకు హైదరాబాద్ వైపు ఎగువ భాగంలో ఉండే రాంపూర్, మడికొండ, సొమిడితో చెరువులు గొలుసు కట్టు మాదిరి ఉన్నాయి. పైభాగంలోని రాంపూర్ చెరువు నిండితే దీనికి కింది భాగంలో ఉండే మడికొండ చెరువుకు, అక్కడి నుంచి సొమిడి చెరువు ఇవన్నీ కలిపి నగరానికి ఆనుకుని ఉండే వడ్డెపల్లి చెరువులోకి వస్తాయి.
ఇది కూడా నిండిందంటే.. ఇప్పుడు సిటీ మధ్యన కనిపించే గోపాల్‍పూర్‍లోని ఊర చెరువుకు ప్రవాహం కొట్టుకువస్తుంది. అయితే వానాకాలంలో వరుసగా 10 నుంచి 15 రోజులు వర్షాలు పడి.. పైనున్న చెరువుల నీరు ఇక్కడివరకు వస్తే తప్పితే.. ఊర చెరువు మత్తడి దుంకదు. కానీ.. రాంపూర్, మడికొండకు దగ్గర్లోని ధర్మసాగర్ వద్ద బుధవారం అత్యధిక వర్షపాతం నమోదవడంతో ఒక్కో చెరువు పొంగుతూ చివరికి గురువారం తెల్లవారుజామున ఊర చెరువు ఉగ్రరూపం దాల్చడంతో చుట్టూరా ఉండే అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ, వివేక్ కాలనీ, గోపాల్‍పూర్, సరస్వతి నగర్, జవహర్ కాలనీ, శ్రీనివాస కాలనీ, సమ్మయ్య నగర్ ఇండ్లలోకి నడుం వరకు వరదనీరు చేరింది.
రూ.100 కోట్లు పెట్టిన్రు..టైమ్‌కు తెరవరాలే
హనుమకొండ సిటీలో వానలు ఎక్కువగా కురిసే క్రమంలో కేయూ 100 ఫీట్ల రోడ్డు చుట్టూరా ఉండే 30 కాలనీలు మునిగేవి. పైభాగం నుంచి వచ్చే వరద ఊర చెరువు నుంచి సాఫీగా నయీంనగర్ నాలాలో కలిసేలా నాలాను అభివృద్ధి చేసి ప్రస్తుత 100 ఫీట్ల రోడ్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (డక్ట్) ఏర్పాటు చేశారు. ఈ రోడ్డులోని తులసి బార్ దాటాక అమరావతినగర్ వద్ద చెరువునీరు నాలాకు పంపేచోటు జాలీలు (స్పిల్ వే) పెట్టారు. ఊర చెరువు పొంగే ఇలాంటి ఎమర్జెన్సీ సేవల్లో ఇక్కడుండే షట్టర్ల వంటివి ఓపెన్ చేయాల్సి ఉందని నాడు పనులు చూసిన ఆఫీసర్లు, కాంట్రాక్ట్ సంస్థ చెప్పాయి.
కాగా, గురువారం తెల్లవారుజామున అప్పుడప్పుడే ఊర చెరువు పొంగడాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అయితే.. దీన్ని ఏర్పాటు చేశాక అంతస్థాయి వరద రావడం ఇదే మొదటిసారి కావడంతో అక్కడికి వచ్చిన సిబ్బందికి దీని పనితీరు, తెరిచే విధానం పూర్తిస్థాయిలో తెలియలేదు. మొత్తంగా జేసీబీలతో తొలగించే ప్రయత్నం చేసినా.. అది తెరుచుకోలేదు. దీనికితోడు లారీలకొద్దీ గుర్రపుడెక్క కొట్టుకువచ్చి నీరుపోకుండా అడ్డుపడింది. దీంతో ఊర చెరువులో నీటి ప్రవాహం పెరిగి పలుచోట్ల కోతకు గురవుతూ కాలనీల్లోకి చేరింది. జరగాల్సిన నష్టం జరిగాక సాయంత్రం సమయంలో భారీ క్రేన్ల సాయంతో చెరువు నీరు నాలాలో కలిసేచోట జాలీలను తొలగించారు.
ముమ్మరంగా సహాయ చర్యలు
తుఫాన్ దెబ్బకు వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లోని కాలనీలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలే కాకుండా రాంనగర్, భవానీనగర్, అశోక్ కాలనీతో కలిపి దాదాపు 100కు పైగా కాలనీల్లోని రోడ్లమీదికి నడుంలోతు వరద నీళ్లు చేరాయి. 40 కాలనీల్లో ఇండ్లలోకి మంచాలు మునిగే ఎత్తు వరకు వరద చేరింది. గురువారం పొద్దున్నే వరంగల్ తూర్పులో మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‍పాయ్‍తో కలిసి ఎన్‍ఎన్ నగర్, బీఆర్ నగర్ తదితర ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయ చర్యలు చేపట్టారు.
హనుమకొండలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి ఊర చెరువు ప్రాంతంలో దెబ్బతిన్న కాలనీల్లో పర్యటించి సహాయ చర్యలు తీసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‍ప్రీత్‍సింగ్, ఎంపీ కడియం కావ్య కూడా లోతట్టు ప్రాంతాల నుంచి ట్రాక్టర్ మీద బాధితులను క్షేమంగా బయటకు తీసుకువచ్చేలా చూశారు. ఎన్డీఆర్‍ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, సిటీలోని పలు పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది.. వరదలో చిక్కుకున్నవారిని క్షేమంగా తీసుకురావడానికి శ్రమించారు. వరద ఉదృతి ఉన్న పలుచోట్ల అధికారులు డ్రోన్ల ద్వారా భోజనం, మెడిసిన్ అందించారు.
ముగ్గురిని బలితీసుకున్న తుఫాన్
మొంథా తుఫాన్ వల్ల వరంగల్, హనుమకొండలో ముగ్గురు చనిపోయారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఊర చెరువు ప్రవహిస్తున్న టీవీ టవర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ డీఈఈ పాక శ్రీనివాస్(65) వరద ఉధృతి గమనించక గల్లంతయ్యారు. తర్వాత కొద్దిదూరంలో ఆయన మృతదేహాన్ని గమనించి జేసీబీ సాయంతో సిబ్బంది బయటకు తీశారు.
వరంగల్ గీసుగొండ ప్రాంతానికి చెందిన పులి అనిల్ (35) బుధవారం రాత్రి ఖమ్మం హైవే నుంచి మైసయ్యనగర్ వెళ్లేచోట గల్లంతయ్యారు. గురువారం ఉదయం మృతదేహం లభించడంతో గుర్తించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లిలో వరదలో కల్వర్ట్ కోసం తీసిన కాలువను గమనించక అప్పని నాగేంద్ర అనే వ్యక్తి మరణించారు.
కబ్జాలతోనే వరద సమస్య: మంత్రి సురేఖ
వరంగల్ తూర్పు ప్రాంతంలో కొన్నేండ్లుగా వానలు కురిస్తే ముంపు, వరద సమస్య వస్తున్నదని.. దీనికి కబ్జాలు, తగ్గిన నాలాలే ప్రధాన కారణమని మంత్రి కొండా సురేఖ అన్నారు. నగర పరిధిలో లోతట్టు ప్రాంతాలు ఉండటమే కాకుండా గతంలో నీరుపారే స్థలాలు, నాలాలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. ఇవేగాక పెరుగుతున్న వరద స్థాయిలకు తగ్గట్టు నాలాలు వెడల్పు లేకపోవడం సమస్యగా మారుతున్నదని చెప్పారు. త్వరలో వీటికి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
470 మంది స్టూడెంట్ల తరలింపు
హనుమకొండ హంటర్ రోడ్‌లోని సీఎస్ఆర్ గార్డెన్ ప్రాంతంలోని గర్ల్స్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థినులను అధికారులు, ఎన్డీఆర్‍ఎఫ్ సిబ్బంది సురక్షితంగా తరలించా రు. వీరుండే హస్టల్ ప్రాంతం వరదతో నిండ టంతో తాళ్లు, లైఫ్ బోట్ల సాయంతో సిబ్బంది వారిని హసన్‍పర్తి, సుబ్బయ్యపల్లి, మడికొండ ల్లోని కాలేజీ హస్టళ్లకు తరలించారు.

 
         
                     
                     
                    