
సమతుల్య ఆహారం ఆరోగ్యకర జీవనానికి అత్యంత ప్రధానం. అలాగే బలమైన, ఆరోగ్యవంతమైన ఉత్పాదకత శక్తి కలిగిన మానవ వనరులు దేశ ప్రగతికి కీలకం. భారతదేశంలో సుమారు 74 శాతం జనాభా మంచి ఆహారాన్ని పొందలేకపోతున్నారు. 16 శాతం ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఉత్పత్తి ఉన్నప్పటికీ ఇతర దేశాల నుంచి దిగుమతులు తప్పడం లేదు.
ఈ కారణంగా ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశమే. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులకు గిరాకీ ఎక్కువవుతోంది. అయితే, దేశీయంగా ఉత్పాదకత పెరిగితేనే దిగుమతులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఆహార ఉత్పత్తుల విషయంలో మనదేశం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశంలో వనరులకు కొరత లేకపోయినా తినే తిండికి మాత్రం ఇబ్బంది తప్పడం లేదు.
ప్రజలకు ఆహార పదార్థాలు అందించడానికి ఇతర దేశాలవైపు చూడవలసిన అవసరం నెలకొంది. వంట నూనెలు, పండ్లు, పప్పు దినుసులు తదితరాలను దిగుమతి చేసుకోకపోతే అవసరాలు తీర్చుకోవడం సాధ్యపడటం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేయవలసి వస్తోంది. ఇంకా విచిత్రం ఏంటంటే దేశ అవసరాలకు కావాల్సిన దాదాపు సగం ఉత్పత్తులు చిన్నచిన్న దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. వీటి విలువ ఏటికేడు పెరుగుతూనే ఉంది.
వాస్తవాలు
పరిశీలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలుస్తోంది. అయితే, అవసరాలకు తగినట్టుగా ఆయా పంటలు మన దగ్గర పండటం లేదు. దీంతో విదేశాల నుంచి వాటిని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అలా 2019–- 20లో ఇండియా దిగుమతి చేసుకున్న పది ప్రధాన వ్యవసాయ సరుకుల మొత్తం విలువ రూ.1.52 లక్షల కోట్లు. అదేవిధంగా 2022-–23లో ఆ మొత్తం రూ.2.82 లక్షల కోట్లకు పెరిగింది. 2024-– 25 ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలలకే ఆ విలువ రూ.2.14 లక్షల కోట్లకు చేరింది.
పెరుగుతున్న వంట నూనె ధరలు
గత ఆర్థిక సంవత్సరం నవంబర్ నాటికి విదేశాల నుంచి మనదేశం దిగుమతి చేసుకున్న ఆయా వ్యవసాయ సరుకుల విలువను వార్షిక నివేదికలో కేంద్రం వెల్లడించింది. దీని ప్రకారం వెజిటబుల్ ఆయిల్స్ దిగుమతి 1, 02,222 కోట్ల రూపాయలుగా ఉంది. పప్పు ధాన్యాల దిగుమతి రూ.27,441 కోట్లు, తాజా పండ్లు రూ.16,092 కోట్లని పేర్కొంది.
ఇంకా చక్కెర 8,004 కోట్ల రూపాయలు, సుగంధ ద్రవ్యాలు రూ.8,710 కోట్లు, జీడిపప్పు 9,896 కోట్ల రూపాయలు, సహజ రబ్బరు రూ.6,798 కోట్లు, ఇతర నూనె గింజలు రూ.978 కోట్లుగానూ తెలిపింది. దేశంలో ఏటా వినియోగించే 2.30 కోట్ల టన్నుల నూనెల్లో 1.50 టన్నులు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఫలితంగా వంట నూనె ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
దేశీయంగా ఉత్పాదకత పెరిగితేనే దిగుమతులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. వాస్తవానికి 70వ దశకం నుంచి దిగుమతులపై ఆధారపడక తప్పడం లేదు. సాగు, వాతావరణం దృష్ట్యా మనకన్నా మెరుగ్గా లేని దేశాల నుంచి నూనెలు, వాటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
స్థానిక ఉత్పత్తిదారులకు చేయూతనివ్వాలి
దేశంలో గత 25 సంవత్సరాలుగా నూనె గింజల పంట విస్తీర్ణం పెరగలేదు. దేశీయంగా ఆహార ఉత్పత్తుల కొరతను తీర్చడానికి, వివిధ రకాల ఆహార పదార్థాలను అందించడానికి దిగుమతులు అవసరం అవుతాయి. అయితే దిగుమతి కారణంగా స్థానిక రైతుల ఉత్పత్తులకు గిరాకీ తగ్గే అవకాశం ఉంది. దిగుమతులు ఆహార భద్రతను పెంచుతాయన్నది నిజమే.
అయితే, స్థానిక ఉత్పత్తిదారులకు ఇబ్బంది లేకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయంలో మాత్రం భారతదేశం గణనీయ ఎగుమతి ప్రగతి సాధించిందని చెప్పక తప్పదు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ వ్యవహారాలను ఎప్పటికప్పుడు సమీక్షించే ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ నివేదిక ప్రకారం ఎగుమతి అంశాన్ని గమనిస్తే భారతీయ గేదె మాంసం నాణ్యత, పోషక విలువల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది.
దీన్ని అధికారులు నిశితంగా పరిశీలించారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద గేదె మాంసం ఎగుమతిదారుగా ఉంది. వియత్నాం, మలేసియా, ఈజిప్ట్, ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఇలలో కీలక మార్కెట్లు ఉన్నాయి.
- జి.యోగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్