
- ప్రైవేటు నుంచి సర్కారులోకి 79 వేల మంది స్టూడెంట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు బడులకు ఆదరణ పెరుగుతోంది. ఈ విద్యాసంవత్సరం కొత్తగా 3.68 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. గతంతో పోలిస్తే అడ్మిషన్లు పెరుగుతుండటం పేరెంట్స్ లో పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని అధికారులు చెప్తున్నారు. స్టేట్లో 2025–26 కొత్త విద్యాసంవత్సరం జూన్12న ప్రారంభమైంది. ఈ క్రమంలోనే అడ్మిషన్ల ప్రక్రియ మొదలుపెట్టారు. దాదాపు నెల రోజులనే భారీగా అడ్మిషన్లు అయ్యాయి. అన్ని బడుల్లో మొత్తం 3,68,054 మంది చేరారు. దీంట్లో కొత్తగా ఒకటో తరగతిలో 1,38,153 మంది చేరగా.. రెండు నుంచి పదో తరగతి వరకూ 2,29,919 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. వీరిలో ప్రైవేటు బడుల నుంచి 79,048 మంది ఉండగా.. ఇతర సర్కారు స్కూళ్ల నుంచి మళ్లీ ప్రభుత్వ బడుల్లో చేరినోళ్లు 1,50,819 మంది ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 572 ప్రీ ప్రైమరీ సెక్షన్లలో 6,146 మందికి అడ్మిషన్లు ఇచ్చారు. గతేడాది ఇదే సమయానికి 2.9 లక్షల అడ్మిషన్లు అయ్యాయి. ఈ లెక్కన సుమారు 70 వేలు ఎక్కువ అడ్మిషన్లు పెరిగాయి. గతేడాది జులై నాటికి ఒకటో తరగతిలో 1.12 లక్షల మంది చేరగా, ప్రైవేటు నుంచి సర్కారులో చేరింది 45వేల మందే ఉన్నారు. ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, చర్యలతో భారీగా అడ్మిషన్లు అయినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ మధ్యనే పదివేల మంది కొత్త టీచర్లను నియమించగా, సర్కారు బడుల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో వసతులు కల్పించారు. ఇవన్నీ సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెరగడానికి దోహదపడ్డాయి. ఆగస్టు నెలాఖరు వరకూ అడ్మిషన్లు ప్రక్రియ ఉంటుందని, మరో లక్ష వరకూ అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
గ్రేటర్లోనే ఎక్కువ అడ్మిషన్లు..
33 జిల్లాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాల్లోనే అడ్మిషన్లు ఎక్కువగా అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 36,325 మంది చేరగా, హైదరాబాద్ లో 23,170 మంది, మేడ్చల్లో 20,545 మంది చేరారు. ఆ తర్వాతి స్థానంలో సిద్దిపేటలో 16,395, సంగారెడ్డిలో 15,596, వికారాబాద్ లో 15,515 మంది చేరారు. ప్రైవేటు నుంచి సర్కారులో చేరిన జిల్లాల్లోనూ రంగారెడ్డి (10,953), హైదరాబాద్ (5,964), మేడ్చెల్ (5054) జిల్లాలున్నాయి.
జిల్లాలు వారీగా ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లు
జిల్లా స్టూడెంట్లు
రంగారెడ్డి 8,203
సంగారెడ్డి 7,489
హైదరాబాద్ 7,392
వికారాబాద్ 6,143
కామారెడ్డి 5,811
మెదక్ 5,797
నల్గొండ 5,773
నిజామాబాద్ 5,535
నాగర్కర్నూల్ 5,354
మేడ్చల్ 5,308